తిరుపతి: హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చొరవతో ఆ ప్రయాణికుడికి సకాలంలో వైద్యసేవలు అందాయి. బుధవారం హైదరాబాద్ నుండి విమానంలో తిరుపతి వస్తున్న శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శశిధర్ ప్రయాణిస్తున్న విమానంలోనే నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయాన్ని ఆమె ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎంవో సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో విమానం వద్దకే డాక్టర్లను, అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్ కోలుకున్నాడు.