- వెయిట్ లిఫ్టర్ శ్రీనివాసరావును ప్రోత్సహిస్తాం
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
అమరావతి(చైతన్యరథం): వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన శ్రీనివాసరావుకు కామన్ వెల్త్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటారని వర్ల రామయ్య పేర్కొన్నారు. విదేశాల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మందంపల్లి శ్రీనివాసరావు అనే దళిత కులానికి చెందిన క్రీడాకారుడిని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శనివారం వర్ల రామయ్య అభినందించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ ఏపీఎస్‌ఆర్టీసీ కాకినాడ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు ప్రవృత్తి రీత్యా మంచి వెయిట్ లిఫ్టర్ అని తెలిసారు. వివిధ పోటీల్లో శ్రీనివాసరావు ఎన్నో పతకాలు సాధించాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో, స్నేహితుల సహాయంతో దేశ, విదేశాల్లో అంతర్జాతీయంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ శ్రీనివాసరావు పలు విజయాలు సాధించాడు. ఇటీవల మలేషియా, సింగపూర్‌లో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 105 కిలోల బరువు విభాగంలో పోటీ చేసి 520 కిలోల బరువు ఎత్తి ప్రథóమ స్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. అక్కడ మూడు మెడల్స్ వచ్చాయి. 2026లో జరగబోయే కామన్‌వెల్త్ పోటీల్లో పాల్గొనేందుకు సహాయ, సహకారాలు అందించాలంటూ వచ్చాడు. దేశంలో క్రీడలను ప్రోత్సహించడంలో అందరు ముఖ్యమంత్రులకంటే చంద్రబాబు నాయుడు ముందుంటారు. చంద్రబాబు హయాంలోనే పలు స్టేడియాలు అభివృద్ధి చెందాయి. శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రాష్ట్రం తరుఫున అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించమని కోరతాను. ఇతనికి కావాల్సిన ఆర్థిక సాయం, మిగతా వనరులన్నీ చంద్రబాబు చేస్తారు. శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా ఒక జిమ్ కావాలి. రాష్టానికి పేరు తీసుకొచ్చే సత్తా శ్రీనివాసరావు దగ్గర ఉందని వర్ల అన్నారు.