- గతానికి మించి అభివృద్ధి చేస్తా
- శవరాజకీయులను తరిమికొట్టండి
- మైనారిటీలకు అన్యాయం జరగనివ్వను
- బంగారు భవిష్యత్ కూటమితోనే సాధ్యం
- పేదలను కలవనివాడు పేదలమనిషా?
- నా పథకాలు.. జగన్‌లా నకిలీ నవరత్నాలు కాదు
- రాష్ట్రాభివృద్ధికి కూటమిని గెలిపించండి
- రేపల్లె ప్రజాగళంలో చంద్రబాబు ఉద్ఘాటన
రేపల్లె (చైతన్యరథం): అసమర్థ జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వర్గాల జీవితాలతో ఆడుకున్న జగన్ ఏలుబడిలో బాగుపడిరది ఐదుగురు రెడ్లు మాత్రమేనన్నారు. జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే బాగుపడ్డారని, రాష్ట్ర ప్రజల బతుకును మాత్రం విధ్వంసానికి గురి చేశాడని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు. తుపానుతో ఈ ప్రాంతం అల్లాడిపోతే నేను వచ్చానుగానీ, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వచ్చాడా? అని చంద్రబాబు నిలదీశారు. రైతాంగం తీవ్ర సంక్షోభానికి గురై రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా.. పెత్తందారుకు కనికరం లేదని దుమ్మెత్తిపోశారు. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో పంట వరదపాలైందని, జగన్ ఐదేళ్ల పాలనలో ఎవరి జీవన ప్రమాణాలు పెరిగాయని బాబు ధ్వజమెత్తారు. చెప్పింది చేసే సత్తా కూటమికి మాత్రమే ఉందని, రాష్ట్రాభివృద్ధికి నిర్ధుష్టమైన ప్రణాళికతో మీముందుకు వచ్చానని అన్నారు. గతంలో నేనుచేసిన అభివృద్ధి కార్యక్రమాలకంటే మెరుగైన విధానాలతో పనిచేస్తామని, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే సంకల్పంగా పవన్ కల్యాణ్‌తో కలిసి వస్తున్నానని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రానున్న బీజేపీతో కలిసింది.. రాష్ట్రాభివృద్ధికి అత్యధిక నిధులు సాధించడానికేనన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతామంటూనే, నేను అభివృద్ధికి ఒక డ్రైవర్‌ను. గతంలో మీరందరు చూశారు. అంతకంటే మెరుగ్గా మరలాచేసే సత్తా నాకుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా. జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటే అన్నారు. ప్రజాగళానికి పోటెత్తుతున్న ప్రజలను చూస్తుంటే `ఎన్నికలు లాంఛనమేనని తేలిపోయిందని రేపల్లె సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘తండ్రులు బిడ్డలను భుజాలకెత్తుకుని వచ్చారు. తలులు, పిల్లలు జెండాలు పట్టుకుని వచ్చారు. ఆ తల్లిదండ్రులు నాపై ఉంచిన నమ్మకం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీ నమ్మకాన్ని నిలబెడుతాం. నాకు 73 సంవత్సరాలు. కానీ, నా ఆలోచనలు నవ యువకుడి ఆలోచనలే. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మీ భవిష్యత్తును బంగారం చేయడమే నా లక్ష్యం’ అని చంద్రబాబు ఉద్వేగంగా ప్రకటించారు.
‘నేను నాయకులతో వస్తుంటే.. ఒంటరినంటున్న జగన్ శవాలతో వస్తున్నాడు. అతనిది శవరాజకీయం, నాది ప్రజారాజకీయం. అక్కను వేధిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నందుకు అమర్‌నాథ్ గౌడ్‌ను చంపేశారు. దోషులకు శిక్ష పడలేదుగానీ, అక్క మాత్రం ఇంకా వేధింపులకు గురవుతూనే ఉంది. చీరాల ఇసుక ట్రాక్టర్‌లో శవం తేలింది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ జగన్‌తో కలిసి తిరుగుతున్నాడు. అదీ జగన్ పాలన’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ గెలస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆనాడే చెప్పానని, చెప్పిందే నిజమైందన్నారు. పోలవరాన్ని 72శాతం పూర్తి చేశాం. పట్టిసీమను ఆగమేఘాల మీద పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చాం. జగన్ వచ్చాక పట్టిసీమను ఆపేస్తే, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడని దుయ్యబట్టారు. ప్రజావేదికను కూల్చి అమరావతి విధ్వంసానికి ఒడిగట్టిన జగన్ `ఐదేళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తరువాత పరిశ్రమల తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి.. తెలంగాణ తలసరి ఆదాయంతోవున్న వ్యత్యాసాన్ని తగ్గిస్తే, జగన్ ఏలుబడిలో ఆ వత్యాసం రెండిరతలు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల మనిషినని చెప్పుకుంటున్న జగన్ `ఐదు రూపాయలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశాడో ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారని, క్లాస్‌వార్ మాస్‌వార్ అంటూ నాటకాలాడుతున్న జగన్‌ది క్యాష్‌వార్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. తెదేపా హయాంలో నాణ్యమైన లిక్కర్‌ను తక్కువ ధరకు అందిస్తే.. మద్యమే నిషేధిస్తానన్న వ్యక్తి నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు క్యాష్‌కు అమ్ముకుని వేల కోట్లు వెనకేసుకున్నాడని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో ప్రజారోగ్యాన్ని ప్రమాదస్థాయికి తీసుకెళ్లిన జగన్‌ను క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చాడా? అని ప్రజలను ప్రశ్నించారు.
కరెంటు ఛార్జీలు, మద్య నిషేధం, సిపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్‌లు అమలు చేశాడా? అని నిలదీశారు. జగన్ రెడ్డి నాలుకకు మడతలు ఎక్కువ. అందుకే చెప్పిన అబద్దాలు మరలా చెప్పకుండా చెప్పడంలో దిట్ట. నీతి గురించి మాట్లాడడానికి జగన్ రెడ్డి సిగ్గుకూడా లేదు. జగన్‌రెడ్డి నమ్మకద్రోహానికి మీరు గుద్దే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్వలవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ఏ అర్హతతో సామాజిక న్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నాడని ప్రశ్నిస్తూ, బీసీలకు 30, ఎస్సీలకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తానని మాటతప్పాడు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, దుల్హన్‌లను రద్దు చేశాడు. మౌజం, ఇమామ్‌లకు గౌరవవేతనం ఇవ్వలేదు. హామీలు నెరవేర్చానని పచ్చి అబద్ధాలు చెప్పడం జగన్‌కే చెల్లిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కూటమి తెచ్చిన సూపర్ టెన్.. జగన్ నకిలీ నవరత్నాలు కాదు.
కూటమి ప్రకటిస్తున్న సూపర్ టెన్ పథకాలు జగన్ తెచ్చిన నకిలీ నవరత్నాల్లాంటివి కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచి ఆడబిడ్డల నిధికి ఖర్చు చేస్తామని, జగన్ మాదిరి పది ఇచ్చి వంద కొట్టేసేవాళ్లం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ‘సూపర్’ పథకాలతో ఆడబిడ్డలు, యువత, అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు వివరించారు.
స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం
ప్రజాగళం వేదికనుంచి నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు వరాలు ప్రకటించారు. ‘రేపల్లెలో వంద పడకలు ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేస్తాం. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తాం. రేపల్లె -నిజాంపట్నం శాశ్వత డంపింగ్ యర్డు పూర్తి చేస్తాం. అనంతవరం కరకట్టను అభివృద్ధి చేస్తాం. వాన్‌పిక్ సిటీని పూర్తి చేసి నిజాంపట్నంను అభివృద్ధి చేస్తాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తాం. బీసీలకు ఏడాది కి రూ.30 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. రేపల్లే బీసీ నియోజకవర్గం. తెదేపా బీసీల పార్టీ. రూ.500 కోట్ల ఆదరణతో బీసీలను ఆదుకుంటాం. మత్స్యకారులు, గౌడ, చేనేతలు ఉన్నారు. వాళ్లందరి కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మైనారిటీలకు అన్యాయం జరగదు
తాను ఎన్డీయేలోవున్నా మైనారిటీలకు అన్యాయం జరగనివ్వనని, రక్షణ కల్పించి పూర్తిగా ఆడుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల మనిషి అనగాని. రేపల్లె ఆయన కుటుంబం. ప్రతీ ఇల్లు ఆయన ఇల్లే. ఇప్పటికి రెండుసార్లు గెలిపించారు. ఈసారి 51వేల ఓట్ల మెజారిటీతో అనగానిని గెలిపించాలని కోరుతున్నా అన్నారు. రోడ్లపై గ్రావెల్ దొంగిలించిన వ్యక్తి ఇక్కడి వైసీపీ అభ్యర్థి. అలాంటి దొంగపైన పోలీస్ ఆఫీసర్‌ను నిలబెట్టానని చమత్కరిస్తూ, కృష్ణప్రసాద్ చదువుకున్న మంచి ఐపీఎస్ అధికారి. బాపట్ల ఎంపీగా మంచి మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను చదువుకున్న వ్యక్తులను ప్రోత్సహిస్తాను. జగన్ దొంగలు, భూకబ్జాదారులను ప్రోత్సహిస్తున్నాడు. రేపల్లె ఆడపడుచులు వీరవనితలుగా ముందుకొచ్చారు. జన సైనికులు వీరోచితంగా బయటకొచ్చారు. గోదావరి ఉధృతి మీలో కనిపిస్తోంది. కాలుపెట్టాలని వైకాపా ప్రయత్నిస్తే సముద్రంలోకి కొట్టుకుపోవడం ఖాయం. కూటమి సభ్యులు, మూడుపార్టీల కార్యకర్తలు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పనిచేయాలని నిర్ణయించాం. నరేంద్రమోదీని స్ఫూర్తిగా తీసుకుని, పవన్‌మీద అభిమానాన్ని గుర్తు చేసుకుని.. మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.