హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమానికి బాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకూ మెట్రోలో నల్ల టీషర్టులు ధరించి ప్రయాణిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చంద్రబాబు అభిమానులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని చోట్ల లాఠీచార్జి చేసి చంద్రబాబు అభిమానులను చెదరగొట్టారు. మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లచొక్కాలు ధరించిన వారిని లోపలకు అనుమతించ లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. అనంతరం, ప్రయాణికులను అనుమతించారు. మరోవైపు, ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నల్ల టీషర్టు వేసుకుని వచ్చిన కొందరు యువకులను అడ్డుకోవడంతో వారు పక్కనే ఉన్న డీ మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్టులు కొనుగోలు చేసి వచ్చారు.
చిన్న పిలుపుతో వస్తున్న స్పందన చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న మద్దతుకు నిదర్శనంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం పెద్దగా ప్రచారం కాని లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమానికి వేలాది మంది బ్లాక్ షర్టులతో రావడం సంచలనంగా మారింది. కేవలం టిక్కెట్ కొనుక్కుని నల్ల చొక్కాలతో మెట్రోలో ప్రయాణిస్తూ చంద్రబాబుకు నిరసన తెలపాలనుకున్నారు. కానీ పోలీసులు చేసిన అతి కారణంగా అది ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోయింది. హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ల నిండా నల్ల చొక్కాలతో యువత కనిపించారు. వారి మానాన వారు నిరసన తెలియచేయనివ్వకుండా ప్రభుత్వం పోలీసుల్ని పురమాయించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మెట్రో స్టేషన్లు మూసి వేసి.. మెట్రో రైళ్లను మధ్యలో ఆపేసి.. నల్ల చొక్కాలు ఉన్న వాళ్లందర్నీ పోలీసులు చొక్కాలు పట్టి లాగి దింపేశారు. అయితే ప్రతి స్టేషన్ లోనూ వెల్లువలా జనం తరలి వచ్చారు. వీరిలో యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా ఉన్నారు. వీరి స్పందన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎల్బీనగర్ నుంచి మియాపూరు మెట్రోలో తిరిగి వెళ్లేందుకు ఐటీ ఉద్యోగుల యత్నించగా టికెట్ ఇవ్వకుండా పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. బస్సుల్లో వెళ్లాలంటూ ఐటీ ఉద్యోగులకు పోలీసుల సూచించారు. మెట్రోలోనే వెళ్తామంటూ ఎల్బీనగర్ వద్ద ఐటీ ఉద్యోగుల నిరసనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
చంద్రబాబు అభిమానులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ అధికారులు మూసివేశారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ మెట్ల దారిని సెక్యూరిటీ సిబ్బంది మూసేశారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు అధికారులు టికెట్లు ఇవ్వలేదు. మెట్రో రైళ్లు ఎక్కకుండా అడ్డుకోవడంతో.. నల్ల చొక్కాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కనీసం రెండు కిలోమీటర్ల మేరు ఈ ర్యాలీ సాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో హైదరాబాద్ లోని ఐటీ ప్రొఫెషనల్స్ ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా.. తమ సంఫీుభావం తెలియచేస్తూనే ఉన్నారు.