- పేర్ని తప్పులే ఆయన కుటుంబసభ్యులను రోడ్డుకు లాగాయి
- ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టించి, సెంటిమెంట్ డ్రామాలు
- వైసీపీ పాలనమీద కూటమి పాలన వంద రెట్లు మేలు
- నాగబాబుకు లొలుత ఎమ్మెల్సీ పదవి, తరువాతే మంత్రి
- ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్యనే
అమరావతి (చైతన్యరథం): అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ సోమవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. భార్య జయసుధ పేరుతో గిడ్డంగి పెట్టమని పేర్నికి ఎవరు చెప్పారు. ఎవరు పెట్టించారని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసింది..అందుకు జరిమానా చెల్లించింది నిజం కాదా అని నిలదీశారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాములు నిర్మించారని..ఇప్పుడు మళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. పేర్ని జయసుధను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసినట్టుగా, ఇంట్లోని ఆడవారిని లక్ష్యంగా చేసుకుని తాము బూతులు తిట్టడంలేదన్నారు. పౌరసరఫరాల శాఖ పరిధిలో ఓ గోడౌన్ లో భారీగా బియ్యం నిల్వలు మాయమయ్యాయి. అక్రమాలు జరిగిన గోడౌన్ పేర్ని జయసుధ పేరు మీద ఉంది. అందువల్ల చట్టపరంగా కేసులో జయసుధ పేరు పెట్టాల్సి ఉంటుంది. తప్పు జరిగిందని తెలిసే గోడౌన్ యజమానులుగా వారు, తప్పును ఒప్పుకొని అప్పటికప్పుడు రూ.1.7 కోట్ల జరిమానా కట్టడానికి ముందుకు వచ్చారు. మరి తప్పు జరిగినప్పుడు దోషులుగా వారి పేరు పెట్టడంలో తప్పేముంది. దీనిలో కక్ష సాధింపు ఎక్కడుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పేర్ని నాని తప్పులు చేశారని.. ఆ తప్పులే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగాయని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడారని.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అధికారం పోయినా.. అహంకారం పోలేదన్నారు.
వంద రెట్లు మేలు
గతంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాలనను.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆరు మాసాల పాలనను బేరీజు వేయాలని వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. వైసీపీ పాలన కంటే వంద రెట్లు మెరుగ్గా తమ పాలన ఉందన్నారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజల అంచనాలు చూస్తే భారీగా ఉన్నాయి. ప్రతి నెల జీతాలు, పెన్షన్లు సమయానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు వ్యవస్థలను సంస్కరించామని, వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగు చేశామని.. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
తొలుత ఎమ్మెల్సీ, తరువాత మంత్రి
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కబోతోందని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. జనసేనలో పవన్‌తో పాటు కీలకంగా వ్యవహరించిన నాగబాబుకు మంత్రి పదవి ఖరారయింది. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ నాగబాబును మొదట ఎమ్మెల్సీని చేస్తామని, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కుల సమీకరణాలతో, బంధు ప్రీతితో తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేయడం లేదని, పార్టీలో తనతోపాటు సమానంగా చాలాకాలం నుంచి కష్టపడుతూ వస్తున్నారు కాబట్టే ఆ పదవి దక్కనుందని చెప్పారు. రాజకీయాల్లో కులం ప్రామాణికం కాదని, పనితీరే కొలమానం అని అన్నారట. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారని, కాబట్టి ఎమ్మెల్సీ చేద్దామనుకుంటున్నామన్నారు.
నెలలో 14 రోజులు జిల్లాలోనే..
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను చిందర వందర చేశారని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్యే ఉంటానని, అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు. దశాబ్దన్నర కాలంగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవడం లేదు. సమస్యలకు పరిష్కారాలు వెతికేలోపు వంద పిటిషన్లు వస్తున్నాయి. చాలా మంది తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించి వస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అయితే, ఒక జిల్లానా..లేక రెండా.. అనేది చూడాలి. సెక్యురిటీ, బస, ఆహార వసతులను కూడా చూసుకోవాలని పవన్ అన్నారు
పనితీరు మెరుగుపడాలి
అధికార వ్యవస్థలో ప్రజల సమస్యలపై స్పందన కరవైంది. అధికార వ్యవస్థలో సమయపాలన సరిగా లేదు. గత ఐదేళ్లలో ఏపీలో అధికార వ్యవస్థ పనితీరు అట్టడుగు స్థాయికి వెళ్లిపోయింది. నాణ్యత పరిశీలన లేకపోవడంతో ఇప్పుడది అలవాటు అయిపోయింది. ఆ అలవాటును మాన్పించడానికి మాకు సమయం పడుతుంది. ఈ క్రమంలో అధికారులు కొంత ఇబ్బంది పడొచ్చు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకోవాలంటే, మిగిలిన రోజులు బాగా పనిచేయాలి. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడమే జిల్లాల పర్యటన ఉద్దేశం. గత ఐదేళ్లలో లంచాలు లేకుండా బదిలీలు జరగలేదు. మేము అధికారం చేపట్టిన తర్వాత మెరిట్ ఆధారంగా పోస్టులు ఇచ్చాం. కొంతమంది జాబితాలో తమ పేర్లు చూసుకుని ఆశ్చర్యపోయారు. పేరు తప్పు పడిరదేమోనని అనుకున్నారు. నా పరిధిలో ఉండే అధికారులను చాలా స్పష్టతతో కేవలం మెరిట్ ఆధారంగా నియమించాం. దీన్ని కింది స్థాయి వరకూ తీసుకెళ్లాలి. ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచామో.. మీ కింది వారినీ అలాగే తీసుకోవాలని చెప్పాను. లంచాలు లేకుండా చూడాలని సూచించా. అవినీతి, లంచగొండితనం చాలా మందిలో జీర్ణించుకుపోయాయి. వీటిని నిర్మూలించాలని పవన్ అన్నారు.