- ఐదేళ్లలో 5లక్షల ఐటీ ఉద్యోగాలు లక్ష్యం
- కేంద్ర డేటా పాలసీ ఖరారైతే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు
- 3నెలల్లో విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలు
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వంలో కొందరు ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడగడంతో వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గురువారం విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… రాష్ట్ర విభజన తర్వాత ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్లారని తెలిపారు. అందులో భాగంగా విశాఖలో ఐటీి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఐటీి రంగంలో 20శాతం మంది తెలుగువారు ఉండటం హర్షణీయం. 2014-19 నడుమ రాష్ట్రానికి దాదాపు 150 కంపెనీలు రావడంతో 50వేల మందికి ఉపాధి లభించింది. డేటా సెంటర్‌ను రప్పించేందుకు అప్పట్లో అదానీతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో ఐటీ రంగ ప్రముఖులతో కాంక్లేవ్ పెట్టాం. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో గత ప్రభుత్వం చర్యలతో బ్రేక్ పడిరది.
గత ప్రభుత్వంలో ఒక మంత్రి కోడిగుడ్డు కథలతో రాష్ట్రాన్ని నవ్వుల పాలుజేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఐటీ కంపెనీల్లో వాటాలడిగారు. నాటి ప్రభుత్వ అనాలోచిత చర్యలతో నిక్సీ, ఎస్‌టిబిఐ వెళ్లిపోయాయి. ఫలితంగా ఏపీ యువత నష్టపోయింది. గత ఐదునెలల్లో ఐటీ కంపెనీలు, ఐటా ప్రతినిధులతో మాట్లాడాను. మా కృషి ఫలితంగా త్వరలో విశాఖకు టీసీఎస్ రాబోతోంది. మూడునెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీంతోపాటు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు కూడా వారు ఒప్పకున్నారు. ఇన్ఫోసిస్ సంస్థను కూడా క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరాం. ఇందుకు అవసరమైన భూముల కోసం వెదుకుతున్నాం. ఆరునెలల్లో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తాం. ఐటీ పరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐటీ రంగంలో రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
డేటా రంగంలో పెట్టుబడులపై దృష్టి
ఇటీవల నేను యుఎస్ పర్యటనకు వెళ్లి పలువురు డేటా సెంటర్ల అధినేతలతో మాట్లాడాను. 2019-24 నడుమ డేటా సెంటర్లపై ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. దాంతో ఆయా సంస్థలు ముంబయి, తమిళనాడు, తెలంగాణాకు వెళ్లిపోయాయి. సరైన పాలసీతో ముందుకు వెళ్లుంటే విశాఖ డేటా సెంటర్లకు క్యాపిటల్ అయ్యేది. ఈ రంగంలో ప్రతి ఏటా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి, అందులో వంద బిలియన్ డాలర్లు ఏపీకి తేవాలన్నది నా లక్ష్యం. డేటా సెంటర్ కంపెనీలతో మాట్లాడినపుడు వారు పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా డేటా సెక్యూరిటీ, టాక్సేషన్, డేటా ఎంబసీలపై కేంద్రస్థాయిలో పాలసీ రూపొందిచాల్సి ఉంది, దీనిపై కూడా చర్చలు జరుపుతున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంతో ముందుకు రాగుతున్నాయి. సోషల్ ఎకో సిస్టమ్ ఏర్పాటులో భాగంగా భారత్ లోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ త్వరలో విశాఖకు రాబోతోంది.
దీంతోపాటు వేలాదిగా హోటళ్లు కూడా రావాల్సి ఉంది. ఇటీవలే టూరిజంను ఇండస్ట్రీగా గుర్తించే పాలసీ తెచ్చాం. నేను రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరిపా, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆయా సంస్థలను విశాఖకు రప్పిస్తాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు గ్లోబల్ డెలివరీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు కొత్త పాలసీ తేవాల్సి ఉంది. దీనిపై కసరత్తు ప్రారంభించాం, వచ్చేనెలలో పాలసీ తెస్తాం. విశాఖలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా చర్చిస్తున్నాం. డేటా సెంటర్ పాలసీ – అవుట్ రీచ్ – సోషల్ ఎకో సిస్టమ్ కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. ఐటీ కంపెనీలకు సంబంధించి ప్రోత్సాహకాలు పెండిరగ్‌లో ఉన్నాయి, ఇందుకోసం ఇటీవల బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. సాధ్యమైనంత త్వరలో బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ముందుకు
వివిధ సంస్థలు తమ యూనిట్లు ఏర్పాటు చేసే క్రమంలో ఒక నెల జాప్యం జరిగినా తమ అంచనాలు తారుమారు అవుతాయని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. అటువంటి సమస్యలు తలెత్తకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ పెట్టాం. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులకు సంబంధించి ప్రతివారం ఫాలో అప్ చేస్తున్నాం. రిలయన్స్ బయో ఇంధన సంస్థ 700 యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబర్చే ఐటీ సంస్థలతో పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయిలో ఉన్న తెలుగువారు నాకు సమాచారం ఇస్తే వారితో చర్చలు జరపడానికి ఎక్కడికి వెళ్లడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అందరం కలసికట్టుగా పనిచేసి రాబోయే ఐదేళ్లలో ఐటీి రంగంలో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధిద్దాం.
ఒకసారి భారీఎత్తున ఐటీ పరిశ్రమలు విశాఖకు వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా తర్వాత ఏమీ చేయలేదు. టైర్-2, టైర్ -3 సిటీలకు కో వర్కింగ్ స్పేస్ ఇచ్చి ఐటీ కంపెనీలను రప్పించే విషయంపై కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. నేను మంత్రి అయ్యాక అదానీ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాను. నేషనల్ లెవల్ డేటా పాలసీ వస్తే రాష్ట్రానికి పెద్దఎత్తున డేటా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. ఇందుకోసం ఐటీి హిల్స్ పై భూముల కేటాయింపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 3 నెలల్లో కనీసం రెండు డేటా కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశముంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యంగా సింగపూర్ నుంచి సీ ల్యాండిరగ్ కేబుల్ రావాల్సి ఉంది. దీనితోపాటు నిక్సీని కూడా విశాఖకు రప్పించడానికి కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.