విజయవాడ(చైతన్యరథం): స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ (ఎస్‌పీఏవీ) మంగళవారం అమృత్ నిధులతో నడిచే సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ వెబ్ పోర్టల్‌ను 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ప్రారంభించారు. పట్టణ ప్రణాళిక, వాతావరణ సున్నిత అభివృద్ధి రంగాల్లో అత్యున్నత స్థాయి, అత్యాధునిక పరిశోధనలు, ప్రాజెక్టులు, శిక్షణ చేపట్టే దేశంలోని అతికొద్ది కేంద్రా ల్లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడను ఒకటిగా గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమృత్ విభాగం గుర్తించింది. దానిని ప్రతిష్ఠాత్మక ‘అమృత్ ఫండెడ్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ (ఏఎఫ్‌సీయూపీసీబీ-ఎస్పీఏవీ)గా గుర్తించింది. అర్బన్ ప్లానింగ్ అండ్ సెటిల్‌మెంట్ డిజైన్ రంగంలో అత్యాధు నిక పరిశోధన, నైపుణ్యాభివృద్ధిని ప్రారంభించే పనిలో కేంద్రం ఉంది. ఇది ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని కొన్ని పట్టణ స్థానిక సంస్థలు, థింక్ ట్యాంకుల సన్నిహిత సమన్వయంతో అనేక ప్రాజెక్టులు, శిక్షణలను ప్రారంభించింది. అంతేకాకుండా పట్టణ ప్రణాళిక, వాతావరణ సున్నితమైన రూపకల్పన కోసం డేటా ఆధారిత అనువర్తనాలు, పరిష్కారాలలో తన పరిధిని విస్తరించే పనిలో ఉంది. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కలలుగన్న స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం కావడంలో ఎస్‌పీఏవీ కీలక పాత్ర పోషించగలదని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీవోజీ చైర్‌పర్సన్ అమోకుమార్ గుప్తా, డైరెక్టర్ ప్రొఫెసర్ కొండ రమేష్ పాల్గొన్నారు.