ముంబయి: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయి బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. న్యూయార్క్ కార్నల్ వర్సిటీనుంచి బీ-ఆర్క్ డిగ్రీ పొందిన తరువాత.. వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రతన్ టాటా.. దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎదగడంలో అకుంఠిత కృషి కనబర్చారు.
బిగ్ టైకూన్‌గా, ఔత్సాహిక వ్యాపార వేత్తలకు రోల్‌మోడల్‌గా నిలిచిన రతన్.. టాటా సామ్రాజ్యానికి బలమైన బ్రాండ్‌గా నిలిచారు. ఒకవైపు వ్యాపార దిగ్గజంగా.. మరోవైపు సామాజిక బాధ్యత తెలిసిన దాతగా రతన్ నిస్వార్థ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం `మిలీనియం ఇయర్ 2000లో భారత మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రకటించి అందించింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సహజ నైజంతో తరువాతి తరలాకు ఆదర్శనంగా నిలిచిన రతన్ టాటాను 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించుకుంది.
రూ.10 వేల కోట్లనుంచి రూ.లక్షల కోట్లకు..
1961లో టాటా గ్రూపులో చేరిన రతన్‌టాటా.. సంస్థ వ్యాపారాలను అంచెలంచెలుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. తన సంపదలో సగానికి మించి దాతృత్వానికే కేటాయించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపించారనడంలో సందేహం లేదు. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించి.. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన.. టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ‘దేశమే ముందు..’ అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన గొప్ప దేశభక్తుడు రతన్ టాటా.
రెండు దశాబ్దాల కాలంలో టాటా గ్రూపుని శిఖరాగ్ర స్థితికి తీసుకెళ్లిన దశలోనే `ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆయనను బిజినెస్ టైకూన్‌గా చూసేవారు. 1991లో జేఆర్డీ టాటా నుంచి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా, వ్యాపార విధానంలో ఆధునిక సంస్కరణలను సాహసోపేతంగా అమలు చేసి.. టాటా గ్రూపును అనన్యసామాన్య స్థితికి తీసుకెళ్లారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో టాటాను మించినవారు లేరు. టాటా కంపెనీని ప్రపంచస్థాయి సంస్థగా ఆవిష్కరించడంలో రతన్ కృషి అసామాన్యం. 2000లో బ్రిటిష్ కంపెనీ టెట్టీని కొనుగోలు చేసిన ఆయన.. 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్ను సంస్థలో భాగం చేశారు.
కరోనాపై పోరుకు రూ.1500 కోట్ల విరాళం
కోవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరుకు రూ.1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. ‘అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కోవిడ్-18పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రతన్ టాటా ఆనాటి ప్రకటనలో స్పష్టంచేశారు.
దాతృత్వమనే పదానికి మించిన వ్యక్తి: ప్రధాని మోదీ
రతన్ టాటా మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దాతృత్వమనే పదానికి మించి.. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’ అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని కొనియాడారు.
దాత, దార్శనికుడు: సీఎం చంద్రబాబు
‘రతన్ టాటా ఒక దాత, దార్శనికుడు. చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయి ముద్రవేసిన ప్రభావవంతుల్లో రతన్ టాటా ప్రత్యేకం. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయాం. అతని వారసత్వం అతను తాకిన ప్రతి హృదయంలో నివాసముంటుంది. ఈరోజు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. పరిశ్రమ, దాతృత్వం మరియు తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన కృషిని స్మరిస్తూ.. కోట్లమందికి ఆదర్శంగా నిలిచిన చారిత్రక జీవితానికి నమస్కరిస్తూ.. శాంతి! అతని ప్రియమైన వారికి మరియు టాటా గ్రూప్‌కు ప్రగాఢ సానుభూతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్‌లో పోస్టు చేశారు.