- లక్షలాది ఉద్యోగాలకు గండి
- విశాఖ పశ్చిమ శంఖారావం సభలో లోకేష్
విశాఖపట్నం: టీడీపీ హయాంలో వచ్చిన పలు పరిశ్రమలు జగన్ ప్రభుత్వ అరాచక, అసమర్థ విధానాల కారణంగా వెనక్కి వెళ్లటంతో విశాఖ నగరానికి తీరని నష్టం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. విశాఖ పశ్చిమ నియోజకర్గంలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ విశాఖలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.. జగన్ ప్రభుత్వ తీరు వల్ల ఆ సంస్థ వెనక్కి వెళ్లటంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. లేకపోతే లక్ష ఉద్యోగాలు వచ్చేవి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను తీసుకువస్తే..కోడిగుడ్డు మంత్రి పంపించి వేశారు. మిలీనియం టవర్స్‌కు కాండ్యుయంట్ కంపెనీని తీసుకువస్తే పంపించివేశారు. ఇలా అనేక పరిశ్రమలను తరిమివేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కు దీటుగా విశాఖను అభివృద్ధి చేస్తాం. ఐటీని తీసుకువస్తాం. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం. హెచ్‌సీఎల్ వచ్చి ఉంటే ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేవని లోకేష్ అన్నారు.
జగన్ విశాఖ పాదయాత్రలో జిల్లాకు 50 హామీలు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ తెస్తామన్నారు, చేయలేదు. విశాఖ మెట్రో పూర్తిచేస్తామన్నారు, పూర్తిచేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మోసం చేశారు. 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు.. ఒక్క తట్ట మట్టి వేయలేదు. ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయని లోకేష్ విమర్శించారు.
అడ్డగోలుగా దోపిడీ
విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువస్తామని చెప్పి భూములు కబ్జా చేస్తున్నారు. దసపల్లా, హయగ్రీవ, లులూ భూములు, ఎక్స్ సర్వీస్‌మెన్ భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు కొట్టేస్తున్నారు. టీడీఆర్ బాండ్లలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. రుషికొండకు గుండుకొట్టి ఏకంగా రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఒక వ్యక్తి కోసం ఇంత ఖర్చు పెట్టారు. అది కూడా వచ్చాడా.. రాలేదు. ఒక వ్యక్తి కోసం ఇంత ఖర్చు పెట్టారు. నేనే చూసి ఆశ్చర్యపోయా. మా తాత, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి ప్యాలెస్ లు ఎప్పుడూ చూడలేదు. అక్కడున్న ఒక బెడ్ రూం చంద్రబాబు ఇల్లంత ఉంది. రెండు నెలలు ఆగండి.. ఆ భవనాలు ప్రజల కోసమే వినియోగిస్తాం. వైవీ సుబ్బారెడ్డి, కొడుకు విక్రాంత్ రెడ్డి వచ్చి పెద్దఎత్తున భూములు, గనులు దోచేస్తున్నారు. జీవీఎంసీలో అవినీతికి పాల్పడుతున్నారు. చెత్తపన్ను వేశారు తప్పితే.. ఎక్కడా రోడ్డు వేయలేదు. డ్రైన్లు కట్టలేదు. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఏయూ యూనివర్సిటీలో 1400 పీహెచ్‌డీ సీట్లు అమ్ముకున్నారు. యూజీసీ గ్రాంట్లు రూ.200కోట్లు కాజేశారని లోకేష్ దుయ్యబట్టారు.
పశ్చిమ నియోజకర్గంలో ఎయిర్ పోర్టు, షిప్ యార్డు, హెచ్పీసీఎల్ తో పాటు అనేక పరిశ్రమలు ఉన్నాయి. 2014 – 19 వరకు పశ్చిమ నియోజకవర్గానికి స్వర్ణయుగం. 7 వేల టిడ్కో ఇళ్లకు పునాది వేసి పనులు ప్రారంభించాం. గోపాలపట్నంలో ఆసుపత్రిని కట్టాం. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ కట్టాం. రైల్వే అండర్ బ్రిడ్రి, పేదలకు పట్టాలు కూడా అందించాం. బీటీ, సీసీ రోడ్లతోపాటు ఇండోర్ స్టేడియంలు నిర్మించాం. హుద్ హుద్ వస్తే సొంత కుటుంబాన్ని కాదని విశాఖ ప్రజలే కుటుంబంగా చంద్రబాబు భావించారు. మా ఇంట్లో శీమంతం జరుగుతుంటే 10 నిమిషాలే ఉన్నారు. రాష్ట్రంలో జగన్ గాలివాటం ఉన్నా విశాఖలో ప్రజలు టీడీపీని గెలిపించారు. మరో రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది. మరిన్ని నిధులు కేటాయించి విశాఖపట్నంను అభివృద్ధి చేస్తాం. కొండప్రాంతాల్లో ఉండేవారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
ఐరన్ లెగ్ జగన్
వైసీపీ ఇన్‌ఛార్జ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన ప్రభుత్వం ఏర్పడగానే మూతపడిన ఎల్జీ పాలిమర్స్ భూముల్లో కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. మూతపడ్డ జింక్ ఫ్యాక్టరీ స్థానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం. జగన్ ఒక భస్మాసురుడు..ఐరన్ లెగ్. ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఫ్యాక్టరీలు పేలుతాయి. పరిపాలనా రాజధాని అన్నాడు..30 ఏళ్లుగా ఉన్న ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ పేలిపోయింది. ఏడాదికొక ఫార్మా పరిశ్రమలో బాయిలర్లు పేలుతున్నాయి. అందుకే ఆ భస్మాసురుడ్ని విశాఖకు ఎంత దూరం పెడితే అంత మంచిది. అవసరమైన మేరకు నిరుపేద కుటుంబాలకు టిడ్కో ఇళ్లు కట్టిస్తాం. అంగన్వాడీ, హెల్త్ క్లినిక్ లు కూడా అక్కడే ఉంటాయి. అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లు పూర్తి చేసి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు అందిస్తాం. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. హలో ఏపీ..బైబై వైసీపీ…ఈ నినాదంతో టీడీనీ-జనసేన కార్యకర్తలు ముందుకు కదలాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.