- తొలిదశ పూర్తిపై చంద్రబాబు అభినందనలు
అమరావతి(చైతన్యరథం): తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేట్ అమరిక ప్రక్రియ తొలిదశ విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 6 రోజుల క్రితం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. డ్యామ్ నుంచి దాదాపు 60 టిఎంసిల నీటిని విడుదల చేస్తే తప్ప స్టాప్‌లాగ్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితిలో అధికారులు అత్యంత సమర్థవంతంగా పనిచేసి నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలోనే స్టాప్ లాగ్ గేటు అమరిక ప్రక్రియ ప్రారంభించారు. ఏపీకి చెందిన రిటైర్డ్ అధికారి కన్నయ్యనాయుడు నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన గేట్లు డిజైన్లు చేయించి పనులు మొదలు పెట్టారు.
మూడు భాగాలుగా చేపట్లే ఈ ప్రక్రియలో మొదటి భాగాన్ని విజయవంతంగా శుక్రవారం సాయంత్రం పూర్తి చేశారు. గేటు అమరిక విషయంలో కర్నాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించింది. గేట్ అమరిక పరిణామాలను అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీటి ప్రవాహం ఉన్న సమయంలో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చడాన్ని చంద్రబాబు అభినందించారు. సమష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన సిబ్బంది, కార్మికులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో ముందుకు వచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పని మొత్తం పూర్తి అయ్యేవరకు సమన్వయంతో పనిచేసి సమస్యను పూర్తిగా అధిగమించాలని రాష్ట్ర అధికారులు, మంత్రులకు సిఎం సూచించారు.