- డీజీపీతో సమీక్ష.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం
- పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి
- వైషమ్యాలు రెచ్చగొట్టేవారిపై నిఘా ఉంచాలి
అమరావతి (చైతన్యరథం): తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండిరచారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి…కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించి, ఇటవుంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేవారిపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలను సీఎం చంద్రబాబుకు డీజీపీ తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.