- బీమా క్లెయిముల పరిష్కారానికి ఉచిత న్యాయసేవ
- వరద బాధితుల కోసం వారంపాటు నిర్వహణ
- రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బబిత
అమరావతి (చైతన్య రథం): విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లెయిముల సత్వర పరిష్కారానికి అక్టోబరు 1నుంచి 7వరకు విజయవాడలో ఇన్స్యూరెన్స్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యారు సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్ బబిత వెల్లడిరచారు. మొటారు వాహనాలు దెబ్బతిన్న వరద బాధితులు అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బీమా కంపెనీలు, ఆటోమొబైల్ స్పేర్ పార్టుల షాపులు, ఆటో డ్రైవర్ల అసోషియేషన్ ప్రతినిధులతో బబిత సమావేశమయ్యారు. మోటారు వాహనాల బీమా క్లెయిముల సత్వర పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా బబిత మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, కార్యనిర్వాహక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్ ఆదేశాలమేరకు ఇన్స్యూరెన్స్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
వరదల సమయంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున తామూ ముంపు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలను పరిశీలించామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచించిన అనేక న్యాయ సేవలు అందించటానికి తమ సంస్థ కృషి చేస్తుందని బబిత వివరించారు. అలాంటి సేవలలో భాగంగానే మోటారు వాహనాల బీమా క్లెయిముల సత్వర పరిష్కారానికి న్యాయస్థాన సముదాయాలలో అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈలోపు మోటారు వాహనాల బీమా క్లెయిముకు సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ.. బాధితులకు సాధ్యమైనంత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను కోరారు. అదేవిధంగా వాహన మరమ్మతుల విషయంలో ఆటోమొబైల్ బాడీ షాప్స్ ప్రతినిధుల సైతం సానుకూలంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
క్లెయిములు, వాహన మరమ్మతుల విషయంలో సమస్యలుంటే.. పరిష్కారానికై జాతీయ టోల్ ఫ్రీ నెంబరు 15100కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అఫీషియల్ వెబ్‌సైట్లో సంబంధిత బాదితులు ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 39-ఎ ప్రకారం ఉచితంగా న్యాయసేవ అందిస్తామని బబిత వెల్లడిరచారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర లింగేశ్వరరావు మాట్లాడుతూ బీమా క్లెయిముల పరిష్కారానికి అదాలత్ చక్కని వేదిక అని, వరద బాదితులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె వెంకటేశ్వరరావు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సహాయ కార్యదర్శి యన్ జేజేశ్వరరావు, బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్, ఆటో డ్రైవర్ల అసోషియేషన్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.