- ఏ అంశాన్నీ తేలికగా తీసుకోవద్దు
- విద్యార్థినులకు పూర్తి ధైర్యమివ్వాలి
- ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీ లేదు
- సైబర్ నిపుణులతోనూ లోతైన దర్యాప్తు
- నిందితులెవరైనా ఉపేక్షించేది లేదు..
- విచారణ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష
- వివరాలపై ఆరా తీసిన చంద్రబాబు
- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన
అమరావతి (చైతన్య రథం): కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంపై సాగుతోన్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. హిడెన్ కెమేరాలు పెట్టారనే అంశంపై జరుగుతోన్న విచారణ సారాంశాన్ని టెలీకాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఘటన వెలుగు చూసిన తరువాత ఎస్పీ, కలెక్టర్‌ను శుక్రవారం కళాశాలకు పంపిన ముఖ్యమంత్రి… అప్పటినుంచీ విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వందలాది విద్యార్థినులకు సంబంధించిన అంశం కావడంతో ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కేసు రిజిస్టరైన అనంతరం జరుగుతున్న విచారణపై సీపం రివ్యూ చేశారు. ఇప్పటివరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో చర్చించారు. విద్యార్ధినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా, అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. ఇప్పటివరకు జరిపిన పరిశీలనలో హిడెన్ కెమేరాలు ఏవీ దొరకలేదని అధికారులు చెప్పగా… మరింత లోతుగా విచారణ జరపాలన్నారు.
అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలన్నారు. డాటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్‌గా ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఆడబిడ్డల భద్రత, మహిళల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో డీ బగ్గింగ్ డివైసెస్తో అన్నిచోట్లా తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
నేరం జరిగిందా? లేదా? అనేది పూర్తి విచారణ తరువాతనే తేలుతుందని…. తప్పు జరిగిందని తేలితే మాత్రం నిందితులను వదలేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థినుల మనోభావాలను గౌరవించాలని సీపం సూచించారు. వారి ఆవేదన అర్థం చేసుకుని విచారణ చేపట్టాలని సూచించారు.
చదువుకునే ఆడబిడ్డలకు ఇలాంటి వివాదం తలెత్తితే మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారని… వారికి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరి దగ్గరైనా ఘటనకు సంబంధించి అదనపు సమాచారం, ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సీఎం కోరారు. ఇదే సమయంలో కొందరు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విద్యార్ధులను మరింత భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని…. అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సున్నితమైన అంశాల విషయంలో తప్పుడు ప్రచారం మరింత నష్టం చేస్తుందని సీఎం అన్నారు. ఎప్పటికప్పుడు విచారణ వివరాలు తనకు చెప్పాలని…. ఘటనలో తప్పు ఉందని తేలితే మాత్రం ఎవరినీ ఉపేక్షించేది ఉండదని సీఎం స్పష్టం చేశారు. తిరిగి విద్యార్థినులు ప్రశాంతంగా చదువు కొనసాగించే పరిస్థితి కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.