- భూముల పరిరక్షణకు కూటమి తొలి అడుగులు
- ‘రెవిన్యూ సదస్సుల’ నుంచే శంఖారావం
- 90 రోజుల్లో అక్రమాలకు చెక్‌పెట్టే ప్రణాళిక
- వైసీపీ హయాంలో 1.75లక్షల ఎకరాలు హాంఫట్
- వాటివిలువ రూ.35వేల కోట్లుగా అంచనా
- శ్వేతపత్రంలోనే వెల్లడిరచిన సీఎం చంద్రబాబు
- భూ అక్రమార్కులను వదిలేదని అప్పుడే హెచ్చరిక
- వైసీపీ భూదందాలపై కుప్పలుగా ఫిర్యాదులు..
- జూలై 15న శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
- ఆగస్టు 15నుంచి ‘సదస్సుల’తో ప్రక్షాళనా చర్యలు
- ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్’ దిశగా సర్కారు
అమరావతి (చైతన్యరథం): ఆధునిక ప్రపంచం అభివృద్ధిచెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది. రాష్ట్ర సంపదగా పరిగణించాల్సిన విలువైన భూములకు లిటిగేషన్లు సృష్టించి ‘ఆర్థిక ఉగ్రవాదులు’ పెద్దఎత్తున కొట్టేశారు. భూ లెక్కలన్నీ బయటకు తీస్తా. నిజానికి కొత్త ప్రభుత్వం సేకరించిన వివరాలకు మించి దోపిడీ సాగింది. అందుకే `ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీదగ్గరున్న సమాచారమివ్వండి. వైకాపా నేతలు లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తా. భూకబ్జాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే రక్షణ కల్పిస్తా. అవసరమైతే న్యాయపోరాటం చేసైనా `బాధితులకు సాంత్వన చేకూరుస్తా. భూఅక్రమార్కులను ఎట్టిపరిస్థితిలో వదిలేదు లేదు.
`వైకాపా పాలనలో ‘సహజవనరుల దోపిడీ’పై జూలై 15న శ్వేతపత్రం విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పకటన సంక్షిప్త సారాంశమిది. సరిగ్గా నెల తిరక్కముందే `భూదందా నిగ్గుతేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘రెవిన్యూ సదస్సులు’ మొదలవుతున్నాయి. ఆగస్టు 15న లాంఛనంగా మొదలవుతున్న రెవిన్యూ సదస్సులు `పదిహేను రోజులపాటు అంటే ఆగస్టు 31వరకూ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భూకబ్జాల నివారణకు ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్’ త్వరలోనే తెస్తామని ఆనాడు సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన దిశగా వేస్తోన్న అడుగులే `రెవిన్యూ సదస్సులు. వైకాపా హయాంలో 1.75 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైందని, వాటి విలువ సుమారు రూ.35వేల కోట్లు ఉండొచ్చని శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో సీఎం చంద్రబాబు ప్రకటించినపుడు `ఏపీవాసుల గుండె బేజారెత్తింది. రాష్ట్రాన్ని కూల్చేసిన జగనాసుర పాలకుడు `సంక్షేమం పేరిట రాష్ట్రప్రజల చేతిలో ఉసిరికాయ పెట్టి గుమ్మడికాయ దోచేసిన విషయం అర్థమైంది.
‘వైసీపీ ఏలుబడిలో భూఅక్రమాలు నేను ప్రకటిస్తున్న వివరాలకు మించి ఎన్నోరెట్లు ఉండొచ్చు’ అంటూ ఆరోజు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా నిజమైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న ‘వినతుల స్వీకరణ’ కార్యక్రమానికి వస్తోన్న వేలాది అర్జీల్లో అధిక భాగం `భూ సమస్యలకు సంబంధించే. మరోపక్క కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న అర్జీల స్వీకారంలోనూ `వైసీపీ నేతలు పాల్పడిన భూ అక్రమాలపై ఫిర్యాదులతోనే వస్తున్నారు. ఇటు విద్యా మంత్రి లోకేష్ నిర్వహిస్తోన్న ‘ప్రజాదర్బార్’కూ `ఉన్న కొద్దిపాటి భూమిని వైసీపీ నేతలు లాక్కున్నారంటూ కళ్లలో కన్నీటితో సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈనెల రోజుల వ్యవధిలో నేరుగా ప్రభుత్వం వద్దకు వచ్చిన భూదందా వివరాలూ తక్కువేం కాదు. భూ అక్రమాల ఫిర్యాదులు ప్రభుత్వం వద్దకు కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో.. అప్రమత్తమైన వైసీపీ నేతలు దృశ్చర్యలకు దిగారు.
ప్రభుత్వం దీనిపై చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో `మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్దానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యతో తమ అక్రమాలను వైసీపీ నేతలు తామే బయటపెట్టుకున్నట్టయ్యింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో జరిగిన ‘ఉద్దేశపూర్వక దస్త్రాల దగ్దం’ ఉదంతం నిగ్గు తేల్చందుకు వెళ్లిన రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు `విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. రికార్డుల తారుమారు నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం వరకూ వేలాది ప్రజా ఫిర్యాదులు సిసోడియా ముందుకు రావడంతో.. ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సాగిన భూదందాకు సంబంధించి క్షేత్రస్థాయినుంచీ సమాచారాన్ని సేకరించేందుకే `రెవిన్యూ సదస్సులకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం పకడ్బంధీ ప్రణాళికనే సిద్ధం చేసింది. జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను నోడల్ అధికారులగా నియమించడంతోపాటు `ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు 45రోజుల గడువు విధించింది. అంటే `నవంబర్ 15లోగా ఫిర్యాదుల స్వీకరణ, చర్యల ప్రక్రియ సైతం పూర్తవుతుందన్న మాట. వైకాపా ఏలుబడిలో అసైన్డ్, చుక్కల భూములు, ప్రయివేట్ భూమలతోపాటు అటవీ, దేవదాయ, వక్ఫ్ భూములు సైతం దిగమించిన పరిస్థితి ఉండటంతో `ఆయా శాఖల అధికార్లను సదస్సు నిర్వహణా కమిటీల్లో కీలకం చేస్తున్నారు. జగన్ జమానాలో రీసర్వే జరిపి సర్వే రాళ్లపై ముద్రించిన లోగోలు, జగన్ బొమ్మలను చెరిపేయాలన్న ఆదేశాలూ జారీ అయ్యాయి. రీసర్వే పూర్తైన భూములకు సంబంధించి రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్న ప్రభుత్వం.. వివాదరహిత భూములకు పాస్‌పుస్తకాలు అందించే అవకాశమూ లేకపోలేదు.
ప్రధానంగా 22ఏ భూములపైనే దృష్టి
రెవిన్యూ సదస్సుల ప్రధాన లక్ష్యం.. వైసీపీ నేతలు కైంకర్యం చేసిన నిషేధిత భూముల నిగ్గు తేల్చాలనే. నిషిద్ధ భూముల జాబితానుంచి ‘ఫ్రీహోల్డ్’ పేరిట తప్పించి పెద్దఎత్తున భూములు అన్యాక్రాంతం జరిగిందన్న అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇప్పటికే ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై మూడు నెలల నిషేధం విధించిన ప్రభుత్వం.. 22ఏ భూములను ‘ఫ్రీహోల్డ్’ క్యాటగిరిలో పెట్టడంపైనా నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. అంటే `రెవిన్యూ సదస్సుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ (నవంబర్ 15) ఈ ఉత్తర్వులు అమలవుతాయి. అంతేకాదు.. వైసీపీ పాలనాకాలంలో (2019`24) ‘ఫ్రీహోల్డ్’ భూముల రిజిస్ట్రేషన్లనూ పునస్సమీక్ష చేయాలన్నది ప్రభుత్వ ఉత్తర్వులు. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన అసైన్డ్ భూములను బలవంతంగా వెనక్కిలాక్కుని.. ఇళ్లపట్టాల ముసుగులో కైంకర్యం చేసిన నేతల గుట్టునూ ఎన్డీయే సర్కారు ఈ రెవిన్యూ సదస్సులనుంచే బయటకు లాగనుంది. ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల వ్యవహారం బహిర్గతమవుతుందని ప్రభుత్వం అంచనా.
ఆ జిల్లాలపైనే డేగ కన్ను
శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగ నాలుగు జిల్లాలను కేస్ స్టడీగా ప్రస్తావించారు. ఆయా జిల్లాల్లో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందన్నది ప్రభుత్వ అంచనా. తాజాగా నిర్వహించనున్న రెవిన్యూ సదస్సుల్లోనూ ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అంటే `విశాఖ, ఒంగోలు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో పెద్దఎత్తున అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వైసీపీ నేతలేకాదు, అధికారులూ ఆయా జిల్లాల భూదందాల్లో పాలుపంచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చడంపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ‘పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూముల అక్రమాలకు సంబంధించి వందల పైళ్లు దొరికాయి. మదనపల్లె పైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ కుటుంబం చేసిన వందల ఎకరాల భూకబ్జాలకు ఆధారాలున్నాయి. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో బాధితులు అధికంగా ఉన్నారు. వైకాపా హయాంలోని అన్ని కుంభకోణాలను బయట పెడతాం’ అని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన ప్రకటన `భూదందాలపై ముఖ్యమంత్రి ఆదేశాల తీవ్రతను స్పష్టం చేయకపోవు.
సదస్సులపై స్పష్టమైన ఆదేశాలు
రెవిన్యూ సదస్సుల నిర్వహణ, అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం సంక్లిష్ట ప్రణాళికను రూపొందించడం వెనుక `భూదందాల నిగ్గు తేల్చడంపై ప్రభుత్వ దృక్పథం తేటతెల్లమవుతోంది. నిషేధిత భూముల జాబితానుంచి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదించాలన్నది ఉత్తర్వుల సారాంశం. అంతేకాదు, ఆయా భూముల సర్వే నెంబర్లను వెంటనే నిషేధిత భూముల జాబితాలోకి చేర్చి.. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నది కూడా ప్రభుత్వ ఆదేశం. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులున్న భూములు, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు సైతం వైసీపీ నేతలు దిగమింగేశారన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటి గుట్టు రాబట్టడానికి ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోందని చెప్పాలి. మరో రెండు రోజుల్లో రెవిన్యూ సదస్సులు మొదలుకానున్న నేపథ్యంలో.. వైసీపీ భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.