- మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ
- విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు
- 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్
విశాఖపట్నం (చైతన్యరథం): ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా స్మగ్లింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, సీజ్ చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని ప్రత్యేక బృందాలు గుర్తించి సీజ్ చేసినట్లు మీడియాకు మంత్రి నాదెండ్ల తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో బియ్యం మాఫియా ముఠాలు రెండు నెలలుగా విశాఖ పోర్ట్‌ను ఎంచుకున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు నుంచి కోటి 38 లక్షల మెట్రిక్ టన్నులు, అదే విధంగా విశాఖపట్నం పోర్టు నుంంచి దాదాపు 36 వేల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేశారని తెలిపారు. సుమారుగా అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందన్నారు. కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ పోర్టు నుండి గత రెండు నెలల కాలంలో 70వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తెలిపారు.
ఇటీవల అధికారుతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ను అప్రమత్తం చేశామన్నారు. పక్కా సమాచారం ఆధారంగానే తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు పోర్టుల్లో నిఘాను పెంచామని ఈ క్రమంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడిరదన్నారు. రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్నామన్నారు. రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిగ్గుతేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. విశాఖలో పట్టుబడ్డ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌కు నివేదిక అందజేస్తామన్నారు.
దళారుల చేతిలో మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు నాదెండ్ల వెల్లడిరచారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో సోమవారం మంత్రి మనోహర్ పర్యటించి స్థానికంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తూ, వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గతేడాది ఈ సమయానికి శ్రీకాకుళం జిల్లాలో 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో 1.15 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేశామని తెలిపారు. రూ.253 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. అలా ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకే విక్రయించవద్దు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ధాన్యంలో తేమ 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేస్తున్నాం. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్పాలిన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చాం. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాం. కాబట్టి వారంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు.