అమరావతి: జగన్ పాలనలో ఐదుగురు దళిత మంత్రులున్నా దళితులకు ఉపయోగం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో 27 మంది దళిత ఎమ్మెల్యేలున్నా దళితుల బాగు కోసం ఏ విధంగాను పని చేయటం లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్రలు దేనికి చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రాంతాలవారీగా చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగ మేమిటి? అసలు జగన్‌కు సామాజిక సాధికారత అంటే అర్థం తెలుసా? దళిత మంత్రులు, నాయకులకు ఇన్నాళ్లు సామాజిక సాధికారత గుర్తుకు రాలేదా? రాష్ట్రంలో సాంఫీుక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా సామాజిక సాధికారత సాధించే దిశగా చంద్రబాబు హయాంలో ప్రయత్నించారు. ఆయా వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను తీసుకొచ్చారు. నేడు జగన్ వాటిని పూర్తిగా తుంగలో తొక్కారు. సామాజిక న్యాయాన్ని అటకెక్కిం చారు.
అమ్మఒడి స్కాలర్ షిప్‌లు గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. టీడీపీ హయాంలోని ఫ్రీ స్కాలర్ షిప్ పథకమే విద్యా దీవెన పథకం. గతంలో టీడీపీ ప్రభుత్వం హాస్టళ్లకు ఇచ్చే మెస్ ఛార్జీలు, వసతి బిల్లులకు పేరు మార్చి వసతి దీవెన అంటున్నారు. కొత్తగా ఏమీ చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ ను విడగొట్టారు. కులాలవారీగా వేరు చేశారు. తెల్ల రేషన్ కార్డుపై రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకంలో కూడా కులాలవారీగా కార్డులెన్ని ఉన్నాయో లెక్కేసి ఏ కులానికి ఎన్ని కోట్లు ఇస్తున్నా మనేది ప్రభుత్వం ప్రజలకు చూపుతోంది. వైసీపీ మం త్రులు, ఎమ్మెల్యేలు ఎస్సీ కులంలో పుట్టి, ఎస్సీలుగా ఉండి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు. అనాదిగా వస్తున్న పలు పథకాలు రద్దయ్యాయని ఆనందబాబు విమర్శించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా నాలుగేళ్లలో 70 వేల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో చదువు కోవడానికి అవకాశం కల్పించాం. ఈ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను రద్దు చేసింది. తాగునీటి పథకానికి దాదాపు 4వందల కోట్లు సబ్‌ప్లాన్ నిధులు వెచ్చించాం. రూ.16 వందల కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు పెట్టాం. 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ డ్ స్కీములిచ్చాం. ఇంకా అనేక పథకాలకు వేల కోట్లు ఖర్చు పెట్టాం. కేంద్రం నుంచి ఎన్‌ఎస్‌ఎఫ్ డీసీ, ఎన్ ఎస్ కే ఎఫ్ డీసీలను తీసుకొచ్చి దాదాపు 17వందల మందికి ఇన్నోవా కార్లు ఇచ్చాం. వేల కోట్లు ఖర్చు చేసి అనేక మందికి స్వయం ఉపాధికల్పించాం. వైసీపీ ప్రభు త్వం ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదు. ఎస్సీ కార్పొ రేషన్‌ను మూడు ముక్కలు చేశారు. ఒక్కరికి కూడా రుణమివ్వలేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళి తులు ఎలా లబ్ధి పొందారో ప్రస్తుత దళిత మంత్రులు, శాసనసభ్యులు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. చంద్ర బాబు పెట్టిన 27పథకాలను రద్దుచేస్తే మాట్లాడే దమ్ము, ధైర్యం నేటి వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేక పోయింది.భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు లేని దళితులకు వేల ఎకరాలు కొనిచ్చింది టీడీపీ ప్రభు త్వం. ఆ భూముల్ని నేడు వైసీపీ ప్రభుత్వం లాక్కుంది. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు అదనపు ప్రయోజ నాల కోసం ఖర్చు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని దళితవాడల్లో ఆరు వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లనిర్మాణం చేశామని ఆనందబాబు చెప్పారు.
దళితుడిని హత్య చేసినా ఎమ్మెల్సీ అనంతబాబుకు పార్టీలో పెద్దపీట
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే సుబ్రమణ్యం అనే దళితుడిని చంపేసి శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరి చేస్తే మొక్కుబడిగా పార్టీ నుండి సస్సెండ్ చేశామనిచెప్పి రాచమర్యాదలతో జైలు నుంచి తీసుకొచ్చారు. అతనికి రెడ్ కార్పెట్ పరిచారు. పార్టీలో పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే లెజిస్లే చర్ పార్టీసమావేశాల్లో,తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య మంత్రి నిర్వహించిన సమావేశాల్లో అతడితో చెట్టాపట్టా లేసుకుని తిరిగారని ఆనందబాబు తప్పుబట్టారు.
ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు శిరోముండనం
ఇసుక మాఫియా గురించిప్రశ్నించాడని వరప్రసాద్ అనే దళితుడికి పోలీసు స్టేషన్‌లో శిరోముండనం చేశా రు. సీఎం సొంత జిల్లాలో నాగమ్మ అనే దళిత మహి ళను హత్యచేస్తే అడగడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు పెట్టారు. అలాంటి జగన్ ప్రభుత్వం సాధికారత గురించి మాట్లాడటమా? దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని అమరా వతిని నిర్వీర్యం చేసి నిస్తేజం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే వారి చేతులకు బేడీలు వేసి నడిపించారు. పైగా వారిమీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని ఆనందబాబు విమర్శించారు