అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్య ఒక్కటి తీర్చలేదని, ఇదేనా మీరు చెప్పే రైతు రాజ్యమని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు లేవని, సరైన నిర్వహణ లేదని సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. జలాశయాల గేట్లు మొరాయిస్తున్నాయని, మొన్న పులిచింతల గేటు, నిన్న గుండ్లకమ్మ గేటు, నేడు తాండవ జలాశయం కాలువ రెగ్యులేటింగ్ గేటు.. నీరంతా వృధా అవుతోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద ఏర్పడ్డ అతిపెద్ద గొయ్యిని గురించి సేఫ్టీ కమిటీ హెచ్చరించినా నేటి వరకూ పూడ్చలేదని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో పరుగులెత్తిన పోలవరం ప్రాజెక్ట్, నేడు పూర్తిగా పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగం బ్యారేజ్ పనులు కూడా నత్త నడక నడుస్తున్నాయన్నారు. గుండ్లకమ్మ నీరంతా సముద్రం పాలు చేశారని, రైతులకు సాగు నీరు లేదని, మత్స్య సంపద నాశనమైందని, అక్కడి మత్స్యకారుల పొట్టపై కొట్టారని పేర్కొన్నారు. నీటి కాలువల నిర్వహణ సరిగాలేదని, పూడుకుపోయిన కాలువల వల్ల చివరి భూముల వరకూ నీరు చేరడంలేదన్నారు. జలసిరి లేదు, జల కళ లేదు, రైతులకు ఏ ప్రయోజనం లేదని తెలిపారు. టమాటా, వరి ధాన్యం, బంతి.. ఇలా పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఆర్బీకేలు వైసీపీ వారి కోసమే ఏర్పటైనా వ్యవస్థ అని విమర్శించారు. మోటర్లకు మీటర్ల పేరుతో రైతుకు ఉరి తాళ్ళు వేస్తున్నారని మండిపడ్డారు. విత్తు వేసే దగ్గర నుంచి ధాన్యం అమ్మి సొమ్ము చేతికి వచ్చే వరకూ ప్రతి అడుగులో అవరోధాలు, ప్రతికూల పరిస్థితులతో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగి దిక్కు తోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపి రైతుల ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా వ్యవసాయరంగాన్ని భ్రష్ఠు పట్టించి, ఇన్ని సమస్యలను రైతుల నెత్తిన వేసిన ఈ అసమర్థ ప్రభుత్వం తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.