అమరావతి(చైతన్యరథం): మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైకాపా మూక దాడి కేసులో దర్యాప్తు అధికారి ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమా దకర ఆయుధాలతో తీవ్రంగా గాయపరచడం)లను చేర్చడాన్ని హైకోర్టు సమర్థించింది. ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఎస్‌ఐఆర్‌లోనే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ 307, 326 సెక్షన్లను చేర్చకపోవడం అప్పటి దర్యాప్తు అధికారి అసమర్థత అని ఆక్షేపించింది. కేసు ప్రాథమిక దశలో అప్పటి ఐఓ విస్మరించిన వివరాలను తర్వాత దశలో సరిచేయడాన్ని తప్పుపట్టలేమంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అదనపు సెక్షన్లు చేర్చవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 307, 326 సెక్షన్లను చేరుస్తూ ఐఓ దాఖలు చేసిన మెమోను తిరస్కరించాలన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. మరోవైపు పిటిషనర్లు జూలై 3 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ సమయంలో దర్యాప్తులో పురోగతి ఉందని గుర్తుచేసింది. పిటిషనర్లకు బెయిలిస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని అభిప్రా యపడిరది.
వాదనలు విన్న అనంతరం నలుగురు నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృపాసాగర్ సోమవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. 2021లో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుం టూ రుకు చెందిన ఎ.వెంకటరెడ్డి, బత్తుల దేవానంద్, షేక్ ఖాజా మొహియుద్దీన్, షేక్ మస్తాన్‌వలీలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. తమకు బెయిల్ మంజూరు చేయాలని వారు చేసిన అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని ప్రకటించారు. పిటిషనర్లకు షరతు లతో బెయిలు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.