- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
- రాయచోటిలో ‘నిజం గెలవాలి’
- రెండు కుటుంబాలకు భువనమ్మ భరోసా
- రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
రాయచోటి (చైతన్యరథం): టీడీపీకి కార్యకర్తలే ప్రాణమని, వారికి కష్టం వస్తే ఆదుకోవటం తమ బాధ్యత అని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం తొలుత రాయచోటి నియోజక వర్గం, గాలివీడు మండలం, ఎగువగొట్టివీడు గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 17న మృతిచెందిన ఎన్ రెడ్డెమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
రెడ్డెమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తరువాత రాయచోటి పట్టణం, రాజులకాలనీలో గత ఏడాది సెప్టెంబర్ 14న మృతి చెందిన ఎం.రవీంద్రరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. భువనేశ్వరిని చూసి రవీంద్ర రాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రవీంద్ర కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు.