విజయవాడ(చైతన్యరథం): వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవడం మన బాధ్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరో రోజూ ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవానీపురం 121, 122 సచివాలయాల పరిధిలో తనవంతు బాధ్యతగా స్వయంగా తెప్పించిన చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఆపన్నులకు సాయమందిస్తూ వారికి ధైర్యం చెబుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిస్తూ తనకు మించిన సహాయాన్ని అందిస్తూ తోడుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వ్యక్తి తమ నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఈ వరదలు నిజంగా మానవ తప్పి దమేనని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో బుడమేరు, పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకోకపోగా తమపై నిందలు వేయడం పులి వెందుల ఎమ్మెల్యేకే చెల్లిందని వ్యాఖ్యానించారు. వరదలు పూర్తిగా తగ్గి జన జీవనం సాధారణ స్థితికి వచ్చేదాకా సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.