- అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందితే సంతోషిస్తా!
- ప్రతిపనీ జనం గుర్తుపెట్టుకోవాలని కోరుకోను
- రాష్ట్రవిభజన కంటే జగన్ విధ్వంసం వల్లే అధిక నష్టం!
- అమరావతితో సహా అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు
- రాజకీయం వేరు..అభివృద్ధివేరు.. నాది అదే ఫార్ములా
- రాష్ట్రంకోసం పనిచేసి పార్టీపరంగా, వ్యక్తిగతంగా నష్టపోయాం
- ముఖ్యమంత్రి పదవిచేపట్టి 27 ఏళ్లయిన సందర్భంగా చంద్రన్న మనోగతం
అమరావతి: రాష్ట్ర విభజనవల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు జగన్ విధ్వంసక పాలన వల్ల ఎపికి ఎక్కువ నష్టం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27ఏళ్లు పూర్తయిన సంద ర్భంగా తన పాలనా అనుభవాలను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పంచుకున్నారు. తమ హయాంలో అమరావతిలో చేపట్టిన పనులు, వచ్చిన సంస్థలను కొనసాగించినా ఈపాటికి ఉత్తమ ఫలితాలు వచ్చేవని అన్నారు.
వైసిపి నేతలు కూడా నిద్రపోవడం లేదు
జగన్ పాలనలో వైసీపీ నేతలు కూడా కంటినిండా నిద్రపోవడంలేదు. వ్యవస్థలను నాశనం చేయడంతో ఇప్పుడు ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చేసింది. తెలుగువారు సమర్థులు, తెలివైనవారు.. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారు. జగన్ సీఎం అయ్యాక అమరావతి మాత్రమే కాదు అన్ని రంగాలు, వ్యవస్థలను నాశనం చేశాడు. అమర్ రాజాపై వైసీపీ ప్రభుత్వం దాడి చేసింది. విశాఖలో సంస్థలను తరిమేశారు. రాజకీయం వేరు.. అభివృద్ధి వేరు..నేను అదే ఫార్ములా ఫాలో అయ్యా. విభజన కంటే ఎక్కువ నష్టం జగన్ వల్ల జరిగిం ది.. ఇది ముమ్మాటికి నిజం. గత ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ఉంటే 2029నాటికి దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండేది. ముఖ్యమంత్రి జగన్ చేసిన విధ్వంసం తాలూకు శిథిలాల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉంది, ఇది చాలా కష్టతరమైన పని.
సంక్షేమానికి బీజం వేసింది టిడిపినే!
సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే..మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తాం. అవగాహన లేనివాళ్లే సంక్షేమం గురించి మాపై విమర్శ లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో ఎన్నో భయాందోళనలు ఉన్నా.. ఆర్థిక లోటులోనూ తెలంగాణ కంటే ఇక్కడ మెరుగైన సంక్షేమాన్ని అందించాం. అభి వృద్ధిలోనూ రాష్ట్రాన్ని పరుగులు తీయించాం.
అభివృద్ధితో చరిత్రనే తిరగరాశాం
టిడిపి హయాంలో చేసిన పనులు చరిత్రనే తిరగరాశాయి. అదే నాకు అన్నింటికంటే సంతృప్తి. నేను చేసిన ప్రతి పని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకోను. ఆ ఫలితం వారికి చేరితే అదే నాకు సంతోషం. 27 ఏళ్ల క్రితం మొదలైన మార్పు ఇప్పుడు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మా ణంలో పెనుమార్పులు వచ్చాయి. తర్వాత ప్రపంచ దేశాల్లో తెలుగువారు స్థిరపడ్డారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకతో తెలుగు యువత ఉపాధి, ఆదాయం భారీగా పెరిగింది. నేషనల్ గేమ్స్ అద్భుతంగా నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించాం. పెద్దఎత్తున అభివృద్ధి కార్యకలాపాల తో ఎకరా రూ.50వేలు ఉండే కోకాపేట భూములు రూ. 40-50 కోట్లకు వెళ్లాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అనంతపురంలో కియా పరిశ్రమ వద్ద కూడా ఆ ఫలితం మనం చూశాం. తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా మార్చాం.
పొత్తులపై కాలమే సమాధానం!
ఎన్డీయేలో చేరబోతున్నానంటూ ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలి..నేనైతే ఇప్పుడేం స్పందించనని అన్నారు. ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తా. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయింది. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్న తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.