- వినుకొండ నియోజకవర్గ ప్రజలకు లోకేష్ ఇచ్చిన హామీ నెరవేరుతుంది
- టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు
- నిజమైన అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ లక్ష్యం
- వినుకొండ నియోజకవర్గ పర్యటనలో భువనేశ్వరి ఉద్ఘాటన
వినుకొండ (చైతన్యరథం): వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు, తాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంత ప్రజలకు వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తారని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, రేమడిచర్ల గ్రామంలో శుక్రవారం నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు పూర్తిగా మోసపోయారన్నారు.
పేద ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం గత ఐదేళ్లుగా అధికారంలో ఉందని విమర్శించారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా…24గంటలు కరెంటు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి మండు వేసవిలో రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో మగ్గబెడుతున్నారని భువనేశ్వరి దుయ్యబట్టారు.
ప్రశ్నిస్తే దాడులు
వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై వైసీపీ గూండాలు, నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఏపీకి ఒక్క కంపెనీ కూడా రాలేదు. యువత నిరుద్యోగ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కంపెనీలు పక్క రాష్ట్రానికి పారిపోతున్నాయి. దీనివల్ల ఏపీలోని యువత ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చంద్రబాబు కష్టపడి తెచ్చిన కంపెనీలను వైసీపీ నాయకులు కక్షకట్టి రాష్ట్రం నుండి తరిమేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. చంద్రబాబు 72 శాతం పూర్తిచేసిన పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షకట్టి గోదావరిలో ముంచి నాశనం చేస్తోంది.
వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా విసిగిపోయి ఉన్నారు…ఇలాంటి దుర్మార్గపు పాలనను అంతం చేసే సమయం రాష్ట్ర ప్రజల చేతుల్లోకి వచ్చింది. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీ పాలనను అంతం చేయాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే రాష్ట్ర ప్రజలు లక్ష్యంగా పెట్టుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల జెండాలు వేరైనా..అజెండా ఒక్కటే…ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడమే ఈ పార్టీల లక్ష్యం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను కూడా తిరిగి పునరుద్ధరిస్తారని భువనేశ్వరి చెప్పారు.