- దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారు
- రెడ్‌బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం
- విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా కృషి
- సాక్షి చదివినా, చూసినా ఆరోగ్యానికి హానికరం
- విలేకరుల సమావేశంలో విద్య, ఐటీిశాఖల మంత్రి నారా లోకేష్
శ్రీకాకుళం(చైతన్యరథం): మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళితే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు.. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలి.. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం.. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతోపాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈఓకు చెప్పాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు.
జగన్ మాదిరి మేం పారిపోయే వ్యక్తులం కాదు!
సూపర్ సిక్స్ పథకాల అమలుపై విలేకరుల ప్రశ్నలకు లోకేష్ సమాధానమిస్తూ జగన్ లా మేం పారిపోయే వ్యక్తులం, కాదు. ఇప్పటికే పెన్షన్లు, మెగా డిఎస్సీ హామీలను అమలు చేశాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్‌లా మేం పరదాలు కట్టుకుని తిరగడంలేదు. తప్పు చేయకపోతే ఆనాడు వారు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలమధ్యనే ప్రజావేదిక నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ చెప్పారు.
సాక్షి చదివినా, చూసినా ఆరోగ్యానికి హానికరం
సాక్షి పత్రిక చదివినా, సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హానికరం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రమంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పారు. ప్రైవేటీకరణ లేదని నేను, మా ఎమ్మెల్యేలందరం బుధవారం స్పష్టం చేశాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల వరదలు సంభవించిన సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు మేం అండగా నిలబడ్డాం. జగన్ ప్రజాధనంతో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నారు కానీ ఏ నాడు జనం ముందుకు వెళ్లలేదు. ఎవరు అసలైన ప్రజానాయకులో రాష్ట్రప్రజలకు అర్థమైందని మంత్రి లోకేష్ అన్నారు.
రెడ్ బుక్ పని ఇప్పటికే ప్రారంభమైంది
గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. వారి హయాంలో ఆయా వర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. రెడ్ బుక్‌పై వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానమిస్తూ… ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదు. ఇందులో భాగంగా ఐపీఎస్ లు కూడా సస్సెండ్ అయ్యారు. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతమని లోకేష్ స్పష్టం చేశారు.
విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.2500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.200 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. జగన్ ధ్వంసం చేసిన విద్యావ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం బాగుచేస్తాం. అందులో భాగంగానే నేను జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు ఒకరోజు పూర్తిగా స్కూళ్ల పరిశీలనకు కేటాయిస్తున్నాను. వాస్తవాలను తెలుసుకోవడానికి స్కూళ్లను తనిఖీ చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. ఇందుకోసం పేరెంట్ ` టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబరు వరకు అందరం ఈ సమావేశాలకు హాజరై పాఠశాలల మెరుగుదలకు వారి సలహాలు తీసుకుంటాం. పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న నాడు-నేడు స్కూలు భవనం గోడకూలి విద్యార్థి మృతిచెందిన ఘటనపై అధికారుల నుంచి నివేదిక కోరాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు.
“