- రాష్ట్రంలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
- 3396 షాపులకు రికార్డ్ స్థాయిలో 89,882 దరఖాస్తులు
- ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం
- అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన చోట పునఃపరిశీలన
- ఈసారి విదేశాల నుంచీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
- నేడు మద్యం దుకాణాల కోసం లాటరీ
- 15న దుకాణాలకు అనుమతి
- 16నుంచి అమల్లోకి నూతన మద్యం విధానం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుల కోసం సోమవారం లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారికి 15న షాపులు కేటాయిస్తారు. 16వ తేదీ నుంచి దుకాణాల్లో అమ్మకాలు సాగించవచ్చు. ఆ రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దరఖాస్తుల ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.
అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా రికార్డుస్థాయిలో వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన దరఖాస్తుల ప్రకారం షాపునకు సగటున 25నుంచి 26 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు గరిష్ఠంగా 5,800 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా పరిధిలో ప్రతి షాపునకూ 50నుంచి 51 దరఖాస్తులను టెండర్ దారులు దాఖలు చేశారు. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వీటిని పునఃపరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
ఈసారి విదేశాల నుంచీ ఆన్‌లైన్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు పెద్దఎత్తున వచ్చాయి. అయితే దరఖాస్తుల తొలిదశలో ఎక్కడికక్కడ భారీఎత్తున ఏర్పడిన మద్యం సిండికేట్లు దరఖాస్తులు పెద్దగా పడకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు హెచ్చరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 14న మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్ అధికారులు లాటరీ నిర్వహిస్తారు. అందులో మద్యం షాపులు వచ్చిన వారికి ఈనెల 15న దుకాణాలకు అనుమతి అందజేస్తారు. దీంతో ఈనెల 16నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి వస్తుంది. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్‌ను రూ.99కే అందివ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే తెలిపింది.