- లోతట్టుప్రాంతాలని తెలిసీ జగనన్న కాలనీలు
- కనీస సౌకర్యాల కల్పనలోనూ మోసాలే..
- ఏలేరు, సుద్దగడ్డ ముంపుపై ప్రత్యేక చర్యలు
- ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
- విపత్తులో సీఎం పనితీరు అనన్యసామాన్యం
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంస
- నియోజకవర్గ ముంపు ప్రాంతాల్లో పర్యటన
అమరావతి (చైతన్య రథం): ‘వైఎస్సార్.. జగనన్న కాలనీల పేరిట గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలైపోయారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేం సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. చినుకు పడితే చాలు మునిగిపోయే భూములను కాలనీల కోసం కొని, కనీస వసతులు కూడా కల్పించకుండా ప్రజలకు ఇచ్చింది. గత ప్రభుత్వం ఆ కాలనీలు పేరుతో కొన్న స్థలాల మార్కెట్ ధరకు, చెల్లించిన పరిహారానికి చాలా వ్యత్యాసం ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలేరు వరద పరిస్థితి పరిశీలను సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సుద్దగడ్డ పొంగడంతో కాలనీకి వెళ్లే రోడ్డులేక.. పడవలో వెళ్లి బాధితులను పరామర్శించారు. వరదలోనే ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించేలా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్ అధికారులకి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలో చినుకు పడితే వరద వచ్చే పరిస్థితి ఉంది. నాలుగడుగుల లోతట్టు ప్రాంతంలో గొల్లప్రోలులో 38 ఎకరాల్లో రెండు వేల మందికి స్థలాలిచ్చారు. ముంపు ప్రాంతమని తెలిసినా, ఎకరా రూ.30 లక్షలు మించని భూమిని రూ.60 లక్షల పరిహారం చెల్లించారు. పట్టాలు తీసుకున్నవాళ్లు 10 శాతం కూడా రాలేదు. లోతట్టు ప్రాంతమని తెలిసీ గత ప్రభుత్వం ప్రజలను ముంచేసిందని వ్యాఖ్యానించారు.
ఏలేరు పరిస్థితిపై నిరంతర సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పటికప్పుడు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. భారీ వర్షాలతో రిజర్వాయర్‌కు అన్నివైపులనుంచీ వరద ముంచెత్తింది. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చన తనకు.. గత ప్రభుత్వం ఎంత మోసం చేసిందో అర్థమైందన్నారు. గత ప్రభుత్వ తప్పులపై అప్పటి పాలకులు సమాధానం చెప్పాలన్నారు. సుద్దగడ్డ వాగు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కరిస్తాము చూడాల్సిన అవసరముందన్నారు. కాలనీకి కనీసం వంతెన నిర్మించివుంటే అనువుగా ఉండేదన్నారు. ఏలేరు, సుద్దగడ్డ ముంపునుంచి రైతాంగానికి, ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.
సీఎం నేతృత్వంలో సమష్టి కృషి
బుడమేరు వరద నుంచి విజయవాడ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని అంటూ… విపత్తునుంచి ప్రజలను రక్షించి ఉపశమనం కలిగించేందుకు సీఎం చంద్రబాఋ రేయింభళ్లు పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేసేలా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని, వరద బాధితులను సీఎం చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విపత్తును సమర్థంగా, సమష్టిగా ఎదుర్కోగలిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వరద బాధితులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు ఉంటాయన్నారు.
ఆక్రమణలపై చర్చ జరగాలి..
బుడమేరు ఆక్రమణల తొలగింపునకు హైడ్రాను మించిన బలమైన వ్యవస్థ తేవాలని పవన్ అభిప్రాయపడ్డారు. నదీ పరివాహక ప్రాంతాల్లో, వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాల్లోని ఆక్రమణదారులను గుర్తించి మొదట వారితో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వరద కష్టంలో ఉన్న పంచాయతీలకు బాధ్యతగా సొంత నిధులతో విరాళం అందించానని, ఆ నిధులు కచ్చితంగా పంచాయతీల ప్రాథమిక అవసరాలకు సరిపోతాయని భావిస్తున్నట్టు పవన్ వెల్లడిరచారు.