- సీఐడీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్‌ను గేటు వద్దే ఆపేసిన సిబ్బంది
- గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికీ అదే పరాభవం
- అనుమతి లేనందున వెనుదిరిగిన వైనం
- ఫోన్‌లో అపాయింట్‌మెంట్ కోరిన కొల్లి రఘురామిరెడ్డికి చుక్కెదురు
అమరావతి(చైతన్యరథం): ఐదేళ్లుగా జగన్ సేవలో తరించి, ఐపీసీకి బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేసిన అధికారులు ఇప్పుడు తమను తాము కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబును శరణు వేడేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. అలాంటి అధికారులను కలిసేందుకు టీడీపీ అధినేత విముఖత చూపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన సేవలో మునిగి ప్రతిపక్ష నేతల్ని వేధింపులకు గురి చేయడమే తమ కర్తవ్యంగా మార్చుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా అన్ని వైపుల నుంచి బిగిస్తున్నారు. మన్నించాలని కోరేందుకో.. మరో కారణమో కానీ చంద్రబాబును కలుస్తామంటూ ఇలాంటి అధికారులు ముందస్తు అనుమతి లేకుండా తాడేపల్లికి వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీస్ కానిస్టేబుళ్లు గేటువద్ద నుంచే వెనక్కి పంపేస్తున్నారు. సీఐడీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి గురువారం చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నివాసానికి రాగా.. గేటు వద్దనుంచే తిప్పి పంపించారు.
చంద్రబాబుపై పలు అక్రమ కేసులు నమోదు చేయించిన సీఐడీ చీఫ్ సంజయ్ సెలవు పెట్టి అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ సెలవుకు అనుమతి దొరకలేదు. ఇప్పుడు ఆయన హడావుడిగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. కరకట్ట గేటు వద్ద ఆపిన సెక్యూరిటీ సిబ్బందికి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు చెప్పగా.. ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు. అయితే, సంజయ్‌ను కలిసేందుకు అనుమతి లేదని జవాబు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపారు. అయితే చాలా సేపు అక్కడి నుంచి కదిలేందుకు సంజయ్ నిరాకరించడంతో పోలీసులు కారును బలవంతంగా పక్కకు తీయించారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకూ ఇదే అనుభవం ఎదురైంది. ఆయన కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్‌ఆర్ కారును ఆపారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో చేసేదేంలేక పీఎస్‌ఆర్ వెనక్కి వెళ్లిపోయారు.
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి ఫోన్ లో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. అధికారులు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో కాబోయే సీఎంను కలుసుకోవడానికి కొల్లి రఘురామిరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది.
కాగా, ఈ ముగ్గురు సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు రావడం గమనార్హం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రాధాన్య పోస్టుల నుంచి తప్పించి, ఇతర శాఖలకు పంపించింది. అయినప్పటికీ అనధికారికంగా వైసీపీ కోసం పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇక నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైకాపాకు విధేయుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయనపై కొరడా రaుళిపించింది. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
అదే విధంగా గుంటూరు కలెక్టర్ వేణగోపాల్ రెడ్డిని కలిసేందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదు. వైకాపా ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. చంద్రబాబును కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదని గేటు వద్దే పోలీసులు ఆయన కారును ఆపారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి వెనుదిరిగారు.
వైసీపీ సర్వీస్‌లో నిండా మునిగిపోయిన అధికారుల మొహాలు చూసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. మామూలుగా అధికారుల విషయంలో చంద్రబాబు ఇంత కఠినంగా ఉండరు. కానీ ఈ సారి మాత్రం వారి ఓవరాక్షన్‌కు తగ్గ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే లోకేష్ రెడ్‌బుక్ పేరుతో ఇలాంటి వారి జాబితా తయారుచేసుకున్నారు.