హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచలేదని, వసతి దీవెన పేరుతో మళ్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టి ప్రజల్ని మోసం చేశారని శ్రీకాకుళం పార్లమెంట్ టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును సర్వ నాశనం చేశారని, టీడీపీ హయాంలో విద్యార్థులకు ఇచ్చిన డైట్ ఛార్జెస్, కాస్మోటిక్ చార్జీలను తీసేసి వసతి దీవెన పేరుతో కొత్తగా ఇస్తున్నట్లు పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో పేద విద్యార్థులకు పీజీ, డిగ్రీలు చదివించామని, పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ లేకుండా చేసింది ఈ జగన్ మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
పేద విద్యార్థులు కేవలం డిగ్రీకే పరిమితమవ్వాలా? మీ బతుకులింతే, మీరు డిగ్రీ వరకు మాత్రమే చదవండని జగన్ పేద విద్యార్థులకు ఆంక్షలు విధించినట్లుందని ఆరోపించారు. టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇచ్చామని, నేడు కేవలం తొమ్మిదిన్నర లక్షల మందికి మాత్రమే ఫీజురీయంబర్స్‌మెంట్ ఇస్తున్నారని, ఇది చాలా అన్యాయమని వాపోయారు. దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులు జగన్ దృష్టిలో కోటీశ్వరులైపోయారా? లేక రాష్ట్రం వదలి వెళ్లిపోయారా? ఈ ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
ఎయిడెడ్ స్కూళ్లను మూత వేయించారని, మెర్జింగ్ పేరుతో దాదాపు 11 వేల స్కూళ్లు ఈ రాష్ట్రంలో మూతపడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో 7 మెగా డీఎస్సీలు నిర్వహించామని, ఒక లక్షా 50 వేల మంది టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, గడచిన నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీనైనా పెట్టారా? అని ప్రశ్నించారు.10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు విదేశాల్లో చదువుకోవడానికి ఎంతమంది పెట్టుకున్నా అందరికీ పంపామన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ టిఎన్‌ఎస్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ గుర్రాల సుమంత్, వైస్ ప్రెసిడెంట్ జమ్ము సంతోష్ కుమార్ , కమిటీ సభ్యులు నరసింహనాయుడు వరుణ్, కొయ్యన సంతోష్ , గొద్దు సాయి, సిహెచ్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.