- వెయిటింగ్‌లో ఉన్నా రోజూ హెడ్ క్వార్టర్స్‌కు రావాల్సిందే
- ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి
- వెళ్లే సమయంలోనూ సంతకం చేయాలి
- అందుబాటులోలేని 16 మందికి మెమోలు
అమరావతి(చైతన్యరథం): గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి, జగన్ అరాచకాలకు అండగా ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. సదరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వెయిటింగ్‌లో పెట్టగా ఆ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో ఉండి తీరాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం మెమోలు జారీ చేశారు. పోస్టింగ్‌లో లేకుండా వెయిటింగ్‌లో ఉన్నాం కదా అని చెప్పి ఇళ్లలో కూర్చుంటానికి కుదరదు.. ప్రతిరోజూ ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం వరకు ఉండాలని, అంతే కాకుండా వెళ్లే సమయంలో అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి మరీ వెళ్లాలని స్పష్టం చేశారు. వెయిటింగ్‌లో ఉండి హెడ్ క్వార్టర్‌లో అందుబాటులో లేని అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సహా మొత్తం 16మంది అధికారులకు మెమోలు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న అధికారులంతా ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశారు. వేటు పడ్డ తర్వాత సదరు అధికారులు అందుబాటులో లేకపోవటంతో డీజీపీ ఈ మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎస్ హోదాలో రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించిన, మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో అమర్యాదగా ప్రవర్తించిన జగన్ ముఠా ఐపీఎస్ అధికారులు మొత్తం ఇక నుంచి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టె రౌడీ షీటర్ల మాదిరి రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ ఆఫీసులో ఒక క్లర్క్ ముందు నిల్చుని రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయి అధికారులకు ఏ బాధ్యత అప్పగించకుండా కార్యాలయంలో ఖాళీగా కూర్చోబెట్టడం కంటే అవమానం, శిక్ష మరొకటి ఉండదు. కానీ అది స్వయంకృతమే. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తాను స్వయంగా తప్పు దారిలో నడుస్తూ ఐపీఎస్ అధికారులను కూడా తప్పు దారిలో నడిపించారు.
జగన్ సర్కార్ ఉన్నప్పుడు ఈ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేయటం, వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే చేపట్టిన బదిలీల్లో సదరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. ఇలాంటి వారిలో కీలకమైన అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్, నిఘా విభాగం చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌లు కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, గుంటూరు ఎస్పీగా పనిచేసిన విజయరావు, విజయవాడ ఏసీపీగా పనిచేసిన విశాల్‌గున్ని, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, అనంతపురం ఎస్పీగా పనిచేసిన పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా, కృష్ణకాంత్ పటేల్, గుంటూరు ఐజీగా పనిచేసిన పాలరాజులను చంద్రబాబు సర్కారు పక్కన పెట్టింది. దీంతో వారంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఒకరిద్దరు పొరుగు దేశాలకు వెళ్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. వీరికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా వీరికి డీజీపీ మెమోలు జారీ చేసి, మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఐపీఎస్‌లకు ఇలాంటి పరిస్థితి బాధాకరం: జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి: కండీషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల్ని, తమను ఐపీఎస్ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.