- వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదు
- నాకోసం పిఠాపురంలో 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను దింపారట
- రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభలో పవన్
రాజోలు: వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉండదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోససీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో శుక్రవారం జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపైనే వ్యాఖ్యలు చేసే దిగజారుడు వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ఘాటుగా విమర్శించారు. చెల్లెలి బట్టలను ఎవరైనా చూస్తారా? ఫలానా రంగు దుస్తులు వేసుకుంటే ఎవరైనా, ఏమైనా అంటామా? పసుపు రంగు చొక్కాలపై కోపంతో బంతిపూల దండలను దేవుళ్లకు, విగ్రహాలకు వేయడం మానేస్తామా? ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? జగన్ ఎంత దిగజారుడు వ్యక్తి అంటే… మా ఇంట్లో నా భార్యను అన్నాడు, చంద్రబాబు భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు… ఇవాళ ఇంకా దిగజారిపోయి సొంత చెల్లెల్ని తిడుతున్నాడు. వివేకా కూతుర్ని తిడుతున్నాడని పవన్ మండిపడ్డారు.
రాజోలు ఎమ్మెల్యే రాపాక అవినీతిపరుడు
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు సెంటు ఇళ్ల పట్టాల విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందులో రాపాకకు కూడా వాటా ఉందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టలేని ఈ ఎమ్మెల్యే మలికిపురం మండలం కత్తిమండలో ఐదు ఎకరాల్లో భవనం కట్టుకున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి రాజోలు ఎమ్మెల్యే అంటూ పవన్ ధ్వజమెత్తారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఇప్పటివరకు దానిపై ఒక్క కూడా మాట్లాడలేదని అన్నారు. మలికిపురంలో దాతలు ఇచ్చిన భూముల్లో ఓ కాలేజీ ఉందని, దానిపై అధికార వైసీపీ నేతల కన్ను పడిరదని అన్నారు. ఆ భూముల విలువ రూ.500 కోట్లు అని, అందుకే ఒక్కొక్క లెక్చరర్ ను బదిలీ చేసి బలవంతంగా పంపించేసి భూములను దోచేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఒక్కొక్క అవినీతిపరుడ్ని బయటికి లాక్కొచ్చి దోచినదంతా కక్కిస్తామని పవన్ హెచ్చరించారు.
జగన్ ఓటమి ఖాయం
జగన్ దిగిపోయే సమయం ఆసన్నమైంది. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, కోనసీమ, రైల్వే కోడూరు, కడప, రాజంపేట, తిరుపతి… ఎక్కడికి వెళ్లినా వైసీపీ ఓడిపోతుంది, ప్రభుత్వం మారిపోతుందన్న విషయం అర్థమైందన్నారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్య ఉంది. ముఖ్యంగా కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రైతాంగం కోసం బలంగా నిలబడుతుందని పవన్ చెప్పారు. రైతుల గురించి, రైతుల కష్టాలు, సమస్యల గురించి తెలియని అనంతబాబుకు వ్యవసాయ సహకార సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. అనంతబాబు అనే వ్యక్తి గురించి మీకు తెలుసు… తనకింద పనిచేసే దళిత డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. దళిత కులానికి చెందిన డ్రైవర్ ను ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతీగతీలేదు. ఇప్పుడదే ఎమ్మెల్సీ రోడ్డుపైకి వచ్చి వైసీపీకి ఓట్లు వేయాలని అడుగుతున్నాడు.
నాకోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురం, గోదావరి జిల్లాల్లో దింపారట. ఒకటే చెబుతున్నా… ఇలాంటి వాటికి భయపడేవాడ్ని కాను. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడం. నేను మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి, జగన్ కు ఒకటే చెబుతున్నా… ఇక్కడుంది జనసేన… మీకు భయపడే పార్టీ కాదు. మీరు ఒక చెయ్యి ఎత్తితే మేం లక్ష చేతులు ఎత్తుతాం’’ అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.