విశాఖపట్నం: జగన్ జలగ లాంటి వాడు.. చప్పుడు లేకుండా ప్రజల రక్తం తాగుతాడు.. అంతే నిశ్శబ్దంగా కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్‌ల్లో వాటాలు కొట్టేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ భూములు, కొండలు, పోర్టులు దేనినీ వదలరు. దోచుకోవడం దాచుకోవడమే జగన్ పని అని దుయ్యబట్టారు. కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ మూసివేసి, అక్కడ పనిచేస్తున్న 10వేల మంది కార్మికులను రోడ్డున పడేశాడు. టీడీపీ దీనిపై పోరాడితే కేరళలో బెర్త్ లేదని ఖాళీగా ఉన్న కంటెయినర్ షిప్ ను తీసుకువచ్చి కృష్ణపట్నం పోర్ట్ లో పెట్టి మరమ్మతులు చేస్తున్నామని నాటకమాడుతున్నారు. నెల్లూరులో కోర్టు దొంగ ఉన్నాడు… ఆయనపేరు కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆ కంటైనర్ వచ్చేటప్పుడు అర్థరాత్రి వీడియోలు తీసి చూడండి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఈ ప్రభుత్వం అద్భుతమైన నాటకాలకు ఇదొక ఉదాహరణ. అక్కడి కార్మికులు చెప్పడం వల్లే మనకు నిజం తెలిసింది. ఇదే పరిస్థితి మన గంగవరం పోర్టుకు రాబోతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే పోర్టుల్లో ఉద్యోగాలు వస్తాయి.
కలిసి ముందుకు వెళ్లాలి
టీడీపీ బలం కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. పసుపు జెండాను చూస్తే నూతన ఉత్సాహం. గత ఐదేళ్ల్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాశారు. వైకాపా కార్యకర్తలకు బూమ్ బూమ్ కావాలి కానీ టీడీపీ కార్యకర్తలకు.. చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు. మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వంద కోట్లు ఖర్చు చేశాం. బాధిత కార్యకర్తల కుటుంబాల పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. మీ అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఒక కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
అత్తగారి ఇల్లులా పోలీస్ స్టేషన్
మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. 7 సార్లు నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లా. నాకు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లులా మారిందని లోకేష్ చమత్కరించారు.
నిప్పులా బతికా
అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపాకు మాత్రం లోకేష్ మూర్ఖుడు అర్ధరాత్రి పోలీసులను పంపి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ముందు రూ. 3వేల కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్లన్నారు, ఇప్పుడు 27 కోట్లని అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో బంధించారు. నేను ఎవరినీ వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు, అక్రమాలకు పాల్పడిన వైకాపా నాయకుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత జ్యుడీషియల్ విచారణ చేయించి జైలుకు పంపిస్తాం. రెడ్ బుక్ ను చూపించి నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటున్నారు. బాంబులకే భయపడలేదు. భయం మన బయోడేటాలోనే లేదు. నేను ఇక్కడే ఉన్నా వచ్చి అరెస్ట్ చేయండి. నేను నిప్పులా బతికా. పరదాల మాటున లేనని లోకేష్ సవాల్ విసిరారు.
పేటీఎం బ్యాచ్ కుట్రలపై జాగ్రత్త
చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్ కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. అండగా నిలబడతానని, ధైర్యంగా ఉండాలని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ కుట్రలు పన్నుతారు. వారికి రూ.5 ఇస్తే చాలు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటన్నింటిని తిప్పికొట్టాలి. జనసేన కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలని లోకేష్ హితవు పలికారు.
కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. బూత్ స్థాయిలో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు బాగా చేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాము. నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. సూపర్-6 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. రాబోయే రెండు నెలలు చాలా కీలకం. అహర్నిశలు ప్రజల్లో ఉండి చైతన్యం తీసుకురావాలి.
ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు
మత సామరస్యానికి మారు పేరు విశాఖ సౌత్. ఒకే కొండపై గుడి, చర్చి, మసీదు ఉంటాయి. విశాఖ సౌత్ ను ఓల్డ్ సిటీ అంటారు. ఇక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేం ఒక పొరబాటు చేశాం. మమ్మల్ని పెద్దమనసుతో క్షమించాలి. మేం చెప్పిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన వ్యక్తిగత స్వార్థంతో వైసిపిలోకి వెళ్లారు, అలాంటి వ్యక్తులకు టీడీపీలో నో ఎంట్రీ. టీడీపీ హయాంలో సౌత్ ను అన్ని విధాల అభివృద్ధి చేశాం. నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. పట్టాలు ఇచ్చాం, సీసీ రోడ్లు వేశాం, డ్రైయిన్లు కూడా కట్టాం. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం. అయినా మీరు గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారాడు. పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు, ఇప్పుడు పెద్ద దొంగ పక్కన చిన్న దొంగగా మారాడు. పేదలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. ఉద్యోగాలు వేలం పెట్టి అమ్మేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చేసి పేదల ఇళ్లపైకి వెళ్తున్నాడు. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి.. ఇలాంటి వ్యక్తులను తరిమికొడదాం. సౌత్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మిస్తాం. మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం. స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేస్తాం.
బంగాళాఖాతంలో కలపాలి
ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరిస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ను కూడా తరలిస్తాం. మెట్ట ప్రాంత భూమస్య కూడా ఉంది. దానిని కూడా పరిష్కరిస్తాం. ఇదే స్టేడియాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువస్తాం. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిగేవి. నేడు ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ వీధుల్లో భూగర్భ డ్రైనేజీలు నిర్మిస్తాం. టీడీపీ-జనసేన కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.