- 5కోట్ల ఆంధ్రులు గర్వించేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం
- అప్పుడు బాబాయి శవం…ఈసారి ఎవరి శవం లేస్తుందో
- టైమ్, డేట్ ఫిక్స్ చేయి… ఎవరు ముసలోడో తేల్చేద్దాం
- చిత్తూరు జిల్లాను క్యాన్సర్‌లా పీడిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం
చంద్రగిరి(చైతన్యరథం): చంద్రగిరిలో నేను పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇక్కడ మార్పు వచ్చింది.. యువగళం సభతో వాతావరణం మారిపోయింది.. జరుగు జగన్ జరుగు… నెలలో వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రగిరిలో గురువారం జరిగిన యువగళం సభకు ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, 30కి పైగా నూతన ఆవిష్కరణలు చేసిన డాక్టర్ పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ…. జగన్ మన జీవితాలతో మూడుముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల విషయంలో దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నారు. విశాఖలో ఒక్క వ్యక్తి బతికేదానికి రూ.500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు. అదే డబ్బు పెడితే వేలమంది నిరుపేదలకు ఇళ్లు కట్టించొచ్చు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం. 5కోట్ల ఆంధ్రులు గర్పించేలా అమరావతి రాజధానిని నిర్మిస్తాం. ఈ మధ్య సైకో జగన్ చంద్రబాబును ముసలి వాడంటూ హేళన చేస్తున్నారు. టైమ్, డేట్ ఫిక్స్ చేయండి, నేను చంద్రబాబును తీసుకువస్తా. తిరుమల కొండ నువ్వు ముందు ఎక్కుతావా, చంద్రబాబు ఎక్కుతారా చూద్దాం. ఎవరు ముసలోడో ప్రజలే తేలుస్తారు. 10 కి.మీ.ల దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లేవాడు, బస్ నుంచి స్టూలు లేకుండా దిగలేని వాడు, అయిదేళ్లుగా ప్యాలెస్ నుంచి బయటకు రాని ముసలోడు జగన్. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పెట్టుబడులు, సంక్షేమంలో నెం.1గా ఉంటే…సైకో పాలనలో గంజాయి, డగ్స్, బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, కోడికత్తి, గులకరాయిలో నెం.1గా నిలిపారు. రాష్ట్రానికి చెందిన కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేయడంలో, పన్నుల బాదుడు, ధరల పెంపులో జగన్ రాష్ట్రాన్ని నెం.1గా నిలిపారు. ఇటీవల ఆయనపై ఎవరో ఇంపోర్డెడ్ గులకరాయి వేశారంట. నాకు కూడా బాధేసింది. అయితే అది విచిత్రంగా జగన్‌తో పాటు వెల్లంపల్లి రెండుకళ్లకు తగిలి పక్కన ఉన్న మరో ముగ్గురికి తగిలిందట. ఇదంతా డ్రామా. గతంలో కోడికత్తి డ్రామా రాష్ట్రప్రజలంతా చూశారు. అప్పుడు కడపలో బాబాయి శవం లేచింది, ఇప్పుడు తాడేపల్లి కొంపనుంచి ఎవరి శవం లేస్తుందోనని నాకు భయంగా ఉంది. తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తాడో ప్రజలంతా ఆలోచించాలని లోకేష్ అన్నారు.
రాష్ట్రానికి తీరని నష్టం…
గత ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన బాధ్యతగా భావించి 15లక్షల కోట్ల పెట్టుబడులు, 35 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నాం. 2 డిఎస్సీ నోటిఫికేషన్‌లు ఇచ్చి 32వేల టీచర్ ఉద్యోగాలు భర్తీచేశాం. టీడీపీ ప్రభుత్వాల హయాంలో 1.5లక్షల టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, రాష్ట్రంలో మిగిలిన అందరు సిఎంలు కేవలం 80వేల టీచర్ పోస్టులు మాత్రమే భర్తీచేశారు. వైసిపి వచ్చాక 2.3 లక్షల పోస్టులు భర్తీచేస్తామన్నారు, వాస్తవంలో భర్తీచేసింది సున్నా. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. జగన్ విధ్వంసక పాలనలో పిపిఎలు రద్దు చేశారు, అమర్ రాజా, రిలయన్స్, హెచ్‌ఎస్‌బిసి తరలిపోయాయి. రాష్ట్రంలో అత్యధిక పన్ను కట్టే అమర్‌రాజా కంపెనీపైకి పొల్యూషన్, లేబర్ డిపార్ట్‌మెంట్, అన్ని ఏజన్సీలను పంపి వేధించారు. దీంతో అమర్‌రాజా లిథియమ్ యూనిట్ తెలంగాణాకు వెళ్లింది. అదే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉంటే 20వేల ఉద్యోగాలు వచ్చేవి. జగన్ వచ్చాక పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యరద్దు చేశారు. జగన్ కూతుళ్లు విదేశాల్లో చదువుతున్నారు. పేదల పిల్లలు చదవకూడదా? ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీపైనే. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్ 1 వరకు ఓకే నోటిఫికేషన్ ఇస్తాం. బాబు సూపర్ -6 లో భాగంగా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ చెప్పారు.
పోలవరం, హంద్రీ-నీవా పూర్తిచేస్తాం…
చిత్తూరు జిల్లాకు జీవనాడి హంద్రీనీవా ప్రాజెక్టును చంద్రబాబు 90శాతం పూర్తిచేశారు. ముందు హంద్రీనీవా పనులు పూర్తిచేస్తాం. పోలవరం పెండిరగ్ పనులు కూడా అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తాం. సిమెంటు, ఇసుక ధరల వల్ల నిరుపేద కుటుంబాలు ఇళ్లు కట్టే పరిస్థితి లేదు. మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు కట్టించి పేదలకు ఇంటి తాళాలు అందజేసే బాధ్యత నాది. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని ప్రభుత్వం సైకో జగన్ ప్రభుత్వం. పరిశ్రమల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖపట్నంకు ఐటి పరిశ్రమలు తెస్తాం. జోహో తెచ్చింది మేమే. నెలలో ప్రభుత్వం మారుతుంది. మళ్లీ ఐటి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. జగన్ ప్రభుత్వం హైస్కూళ్లు, హాస్పటల్స్ వద్ద మద్యం దుకాణాలు పెట్టారు. టార్గెట్లు ఇచ్చి అమ్మిస్తున్నారు. జగన్ మద్యం విషం కన్నా ప్రమాదం. పాత మద్యం విధానం తెస్తాం. క్వాలిటీ మద్యం తెస్తాం, మద్య నియంత్రణ చేస్తాం. టిసిఎల్ పరిశ్రమ వల్ల 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. బడాచోర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చైనీస్ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. ఇలాంటివారితో ఉద్యోగాలు ఎలా వస్తాయి? అధికారంలోకి వచ్చాక మళ్లీ చిత్తూరు కేంద్రంగా పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తాం. ఎలక్ట్రానిక్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. ఉద్యోగాలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మిషన్ రాయలసీమతో కష్టాలు తీరుస్తాం!
రాయలసీమలో 6చోట్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాను. కడప జిల్లా దాటే సమయంలో మిషన్ రాయలసీమను ప్రకటించా. మొదటి హామీ రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా. మొక్క నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు సాయం చేస్తాం. 90శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. జగన్ పాలనలో పాడిరైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. పాడిరంగానికి పూర్వవైభవం తెస్తాం. రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం. అనంతపురంలో ఆటోమొబైల్ పరిశ్రమలు తెస్తాం. కడప జిల్లాను స్పోర్ట్స్‌హబ్ గా తీర్చిదిద్దుతాం. పర్యాటక కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. గత చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరుజిల్లా.. షామి, బ్లూస్టార్, టిసిఎల్ టివి, వాషింగ్ మిషన్లు, ఏసీ తయారీ యూనిట్లు, సెట్‌టాప్ బాక్సుల తయారీతో మేడిన్ చిత్తూరు జిల్లాగా ఖ్యాతిగడిరచింది. టిడిపి అధికారంలో ఉన్నపుడు టిసిఎల్, జోహో, కియా, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్, డిక్సన్ వంటి వందల పరిశ్రమలు చిత్తూరుజిల్లాకు వచ్చాయి. ఆ పరిశ్రమల్లో ఇప్పుడు 50వేలమంది పనిచేస్తున్నారు. శాసనమండలి సాక్షిగా టిడిపి హయాంలో ఆరులక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ మంత్రే ఒప్పుకున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇంక్యుబేటర్ , మార్కెట్ లింకేజి విధానం తెస్తాం. అయిదేళ్లలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఐటి, పోర్టులు అభివృద్ధి చేస్తాం. ఏపీని ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదద్దడమే మా లక్ష్యం అని లోకేష్ ఉద్ఘాటించారు.
ప్రతి గడపకు తాగునీరు…
రాయలసీమలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటా. మేం వచ్చాక బిందెలు పట్టుకుని తిరిగే రోజులు పోతాయి. నంద్యాల, కర్నూలుకు చాలా తేడా ఉంది. నంద్యాల సస్యశ్యామలంగా ఉంది, కర్నూలులో వలసలు ఎక్కువగా ఉన్నాయి. వందలమంది ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్తున్నారు. మ్యానిఫెస్టోలో సాగునీటి ప్రాజెక్టుల్లో మొదటి ప్రాధాన్యత కర్నూలు పార్లమెంటుకే ఇస్తాం. అయిదేళ్లలో పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఆలూరు నియోజకవర్గంలో 5 నుంచి 7 కి.మీ.లు నీటి కోసం వెళ్తున్నారు. ఆనాడే చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పా. చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేశారు. జెసిబిలు, టిప్పర్లకు సబ్సిడీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక రద్దుచేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయిస్తాం, కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం. పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఆ నిధులు ఖర్చుచేస్తామని లోకేష్ చెప్పారు.
నాది యువగళమే… అభివృద్ధి చేయడానికే వచ్చా!
నాది యువగళమే. నా బ్రాండ్ దబిడిదిబిడే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చా. స్టాన్ ఫోర్డ్ చదువు తర్వాత అయిదుసంవత్సరాలు ఉద్యోగం చేశా. 2019లో ఓటమి చెందా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ప్రజలకు అండగా నిలబడ్డా. అందుకే నాపై 23కేసులు పెట్టారు. ఆనాడే చెప్పాను, ఈ లోకేష్ తగ్గేదే లేదని. బాంబులకే భయపడలేదు, చిల్లరకేసులకు భయపడతామా? సింహంతో ఆడుకున్నారు, 53రోజులు జైలులో పెట్టారు. ఆ సింహమే ఈనాడు మిమ్మల్ని వేటాడుతోంది. కెజి నుంచి పిజి వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేయాలి. మహిళలను గౌరవించే పాఠ్యాంశాలు తెస్తాం. మహిళలకు పెద్దపీట వేయాలనే అంశంపై చైతన్యం తెస్తాం. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రద్దుచేయటంతో హాల్ టిక్కెట్లు, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం తెస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తాం. విదేశీ విద్యను తిరిగి ప్రారంభించే బాధ్యత తీసుకుంటాం. ఐఐటి, ఐషర్ తీసుకువచ్చాం. మెరుగైన సంస్థలను తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
చంద్రగిరి నుంచి మార్పు మొదలైంది!
చిత్తూరు జిల్లా చిందేసింది. విజయనగరం సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న నేల చంద్రగిరి. ఈ నేలలో చాలా పవర్ ఉంది. ప్రపంచానికే విజనరీ నాయకుడు చంద్రబాబు జన్మించిన నేల చంద్రగిరి నేల. చంద్రబాబుతోపాటు కిరణ్ కుమార్‌ను సిఎం చేసిన ఘనత ఈ నేలది. గతంలో యువగళం పాదయాత్ర చిత్తూరుకు వచ్చేసరికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు మొదలైంది. ఇప్పుడు యువగళం సభతో వాతావరణంలో మార్పు వచ్చింది. ఇక సైకో జగన్ ఇంటికెళ్లడం ఖాయం. చిత్తూరు జిల్లా ప్రజలంతా ఆలోచించాలి. గత ఎన్నికల్లో కుప్పం మినహా అన్ని సీట్లలో వైసిపిని గెలిపించారు. నాలుగేళ్ల 11 నెలల్లో ఒక్క పరిశ్రమ వచ్చిందా, ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఎవరెన్ని కంపెనీలు తెచ్చారో నేను చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే అటునుంచి సౌండ్ రాలేదు. ఏపీలో సైకో ఉంటే, చిత్తూరుజిల్లాలో పాపాల పెద్దిరెడ్డి ఉన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఏదీ వదిలిపెట్టలేదు. కల్తీ మద్యంపై ఓంప్రతాప్ మాట్లాడితే రాత్రికి రాత్రి చంపేశారు. పాదయాత్రలో చూశాను. ఎక్కడకు వెళ్లినా పిఎల్‌ఆర్ అనే టిప్పర్లే ఉన్నాయి. క్యాన్సర్‌లా చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి కుటుంబం నాశనం చేస్తోంది. ఈనెల 13న ఓటుద్వారా పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి బుద్దిచెప్పాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చెవిలో పువ్వు…
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి చెవిలో పువ్వు అని పేరు పెట్టా. అయిదు సంవత్సరాల్లో వేల కోట్లు దోచుకున్నారు. ఇక్కడ సినిమా అయిపోయిందని తెలుసుకొని ప్రకాశం జిల్లాకు పారిపోయారు. జూనియర్‌ను రంగంలో దించారు. ఈ కుటుంబానికి రెండుసార్లు అవకాశమిచ్చారు, ఏమైనా మార్పు వచ్చిందా, ఒక్క పరిశ్రమ వచ్చిందా, చంద్రగిరి ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. అయిదేళ్లుగా చంద్రగిరిలో ఒక్క కార్యక్రమం లేదు. అడ్డగోలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయి అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. వేలాది కుటుంబాలు గంజాయికి బానిసలయ్యాయి. వేలాది కుటుంబాలు చంద్రగిరిలో గంజాయి కారణంగా నష్టపోయాయి. చెవిలో పువ్వు పెట్టే చెవిరెడ్డి కావాలా, ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేసిన నాని కావాలో తేల్చుకోండి. ఎర్రచందనం స్మగ్లర్ కావాలా, కష్టపడి చెమటోడ్చి సొంత సొమ్ము ప్రజలకోసం ఖర్చుచేసే నాని కావాలో తేల్చుకోండి. ఓడిపోయినా నాని అయిదేళ్లు మీకోసం సేవలు చేశారు. భారీ మెజారిటీతో నానిని గెలిపించండి, చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. చిత్తూరు ఎంపిగా దగ్గుమళ్ల ప్రసాద్ నీతి, నిజాయియితీకి మారుపేరు. మీ ప్రాంతానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేవాలంటే కేంద్రం నుంచి సబ్సిడీలు తేవాలి. రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి గెలిపించండి. నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడిరచండి, చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తీసుకుంటానని లోకేష్ అన్నారు.
చంద్రగిరిని దోచుకున్న అపరిచితుడు: పులివర్తి
చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ… చంద్రగిరి అపరిచితుడు చెవిరెడ్డి సుమారు 5వేల కోట్లు సంపాదించారు. ఎర్రచందనంపై మన ప్రభుత్వం 1300 కేసులు పెడితే, ఈ ప్రభుత్వం 150 కేసులు కూడా పెట్టలేదు. దీని వెనుక చెవిరెడ్డి ఉన్నారు. దీనిద్వారా రూ.1500 కోట్లు సంపాదించారు. ఆత్రేయపురం కొండ కొల్లగొట్టారు. నడవలూరు నుంచి 250 టిప్పర్ల మట్టితోడేసి అయిదేళ్లలో ఎర్రమట్టిలో రూ.750 కోట్లు కొట్టేశారు. ఇసుకలో అయిదేళ్లలో రూ.2500 కోట్లు సంపాదించారు. మఠం భూములు కబ్జా చేశారు. తుడాను కల్పవృక్షంగా మార్చుకున్నారు. గతంలో తుడాలో రూ.450 కోట్లు ఉండేవి, ఇప్పుడు రూ.80కోట్లు ఓడి తీసుకున్నారు. ఎమ్మార్వో, రిజిస్ట్రార్, ఎండిఓ ఆఫీసుల వద్ద మామూళ్లు దండుకున్నారు. ఆర్డీఓలు కూడా ఆయనకు సంవత్సరానికి కోటిరూపాయలు కప్పం కట్టాలి. నేను తప్పు చేస్తే నన్ను, నాభార్య, కుటుంబాన్ని చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద కట్టేసి కొట్టండి. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అవినీతికి తావులేకుండా పనిచేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. అక్రమాలతో రూ.5వేల కోట్లు సంపాదించిన ఊసరవెల్లి ఎలక్షన్ వస్తే నెలరోజులు రోడ్డుపైకి వస్తాడు, కుల,మతాలను రెచ్చగొడతాడు. చావు అయినా, రేవైనా మే 13వరకు ఓపిగ్గా ఉండి తేల్చకుంటాం. నన్ను బతికించినా, చంపినా చంద్రగిరి ప్రజలే, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని నాని కోరారు.