- ఎర్రగొండపాలెం సీఐ, ఎస్‌ఐల వేధింపుల వల్లే దళిత యువకుడు మోజెస్ ఆత్మహత్య
- రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
అమరావతి: దళితుల ఓట్లతో అధికారంలోని వచ్చిన జగన్ రెడ్డి నేడు వారినే అణగదొక్కుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఎర్రగొండపాలెం సీఐ, ఎస్‌ఐల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు మోజెస్ కు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం దళితుల శవాలతో బేరసారాలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల శవాలను పక్కన పెట్టుకొని బేరసారాలు, సెటిల్‌మెంట్ లు చేస్తున్న కొందరు మంత్రులు చనిపోయిన వ్యక్తి బ్రతికున్నా అంతకంటే ఎక్కువ సంపాదించలేడని చెప్పడం చాలా ఘోరమైన విషయం. జగన్ పాలనలో దళితుల శవాలకు ధర కడుతున్నారు.. ఇదెక్కడి న్యాయం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో మోజెస్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన ఎస్‌ఐ, సీఐలను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎర్రగొండపాలెం మాదిగ యువకుడు మోజేస్ మరణం వెనుక దాగి ఉన్న నిజాన్ని ప్రభుత్వం నిగ్గుతేల్చాలి. అతని మరణంలో నిజా నిజాలు తేలాలంటే వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలి. పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపుతుంటారు, జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు సెటిల్ మెంట్ లు చేస్తుంటారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని వర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
మోజెస్ శవానికి ధర కట్టిన మంత్రిని బర్తరఫ్ చేయాలి
నా దళితులు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ ఇంతవరకు మోజెస్ మృతిపై ఎందుకు స్పందించలేదు. దళితులపై ప్రేమ కేవలం మాటల్లోనేనా? ఆచరణలో మాత్రం శూన్యం. దళితుల మరణాల పట్ల ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష చేయలేదు. ఇప్పటికైనా దళితుల దాడులపై సమీక్షించాల్సిన అవసరముంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిన మంత్రి ఆదిమూలపు సురేష్ .. ఏదో ఇస్తున్నారు కదా తీసుకొని వెళ్లిపొండి అనడం ఎంత దుర్మార్గం. దళిత కులానికి చెందిన వ్యక్తిగా ఉండి దళితుడి పట్ల ఇలా మాట్లాడటానికి మనసెలా ఒప్పింది? మోజెస్ శవానికి ధర కట్టిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక్క క్షణం కూడా దళిత మంత్రిగా కొనసాగే హక్కు లేదు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దళితులు నా మేనమామలని చెబుతూనే వారిపై జగన్ దమనకాండకు పాల్పడుతున్నారు. ఆయన మేనమామ కాదు దళితుల పట్ల కంసమామ. దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ కు వారిపట్ల ఏ మాత్రం కృతజ్ఞతా భావం లేదు. దళితుల అభివృద్దికి మోకాలడ్డిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైంది. దళితులను చంపి ఆ విషయాలను కప్పిపుచ్చుకునేందుకు బాధిత కుటుంబాలతో బేరాలాడడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని వర్ల విమర్శించారు.
దళితుల ప్రాణాలకు వెల కడుతున్న జగన్ ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల ప్రాణాలకు వెలకడుతూ వారి పట్ల చిన్నచూపు చూస్తోంది. పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపడం… జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు సెటిల్‌మెంట్ లు చేయడం ఆనవాయితీగా మారింది. వైసీపీ ప్రభుత్వం 185 మంది దళితులను పొట్టన పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. జగన్ మానసికంగా దళిత వ్యతిరేకి. దళిత జాతికి జగన్ ఏం సందేశమివ్వాలనుకున్నారు? దళితల పట్ల జగన్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో వారానికి నలుగురు దళితులు హత్యకు గురవుతున్నారు. తెలుగుదేశం హయాంలో దళితులను తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేలా చేశారు. భూ పంపిణీ పథకం కింద వేలాదిమందికి భూమిని పంపిణీ చేసి వారిని భూస్వాములు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క ఎకరమైనా దళితులకు ఇచ్చారా? టీడీపీ హయాంలో అనేక మంది దళితులను ఇన్నోవా కార్లకు యజమానులు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క దళితుడికైనా ఒక్క ఇన్నోవా కారు ఇచ్చారా? ఒక్క దళితుడినైనా విదేశాలకు పంపించి చదివించగలిగారా? దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. దళిత సంక్షేమం అంటే ఇదేనా? దళితుల పట్ల ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? ఏ తప్పు చేయని మోజెస్ పోలీసుల వల్లే చనిపోయాడు, బాధ్యత ప్రభుత్వానిదే. కనుక 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వర్ల రామయ్య అన్నారు.