- భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కుట్ర
- దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తారా?
- వైసీపీ గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి
- టీడీపీ సీనియర్ నేత వర్ల డిమాండ్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయ భ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసీపీ గూండాల ఆలోచనగా కన్పిస్తోందని ఒక ప్రకటనలో వర్ల పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్‌కుమార్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. దీనిని ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి, మాజీ సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన బూర్ల రామాంజనేయులుపై వైసీపీ గూండాలు స్వైరవిహారం చేసి వాహనం ధ్వంసం చేసి, ఆయనపై దాడికి ప్రయత్నించారు. ప్రజాగళం సభకు వెళ్లాడన్న అక్కసుతో గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్ కు చెందిన గిరిజనుడు మునయ్యను వైసీపీ గూండాలు గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారు.
ఆ ఘటన జరిగి 24గంటలు గడవకముందే ప్రత్తిపాడులో దళితుడైన టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు వాహనాన్ని ధ్వంసంచేసి ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించడమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. అదేమని ప్రశ్నించిన రామాంజనేయులుపై దాడికి పాల్పడటం దారుణం. ప్రత్తిపాడులో రామాంజనేయులుపై దాడిచేసిన వైసీపీ గూండాలపై కేసులు నమోదు చేసి, కఠినచర్యలు తీసుకోవాలి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్థితో సమావేశమైన వాలంటీర్లందరినీ తక్షణమే తొలగించాలి. తాడేపల్లి ప్యాలెస్ ప్రలోభాలకు లొంగి ఏకపక్షంగా వ్యవహరించే పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి. పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని వర్ల స్పష్టం చేశారు.