భూతగాదాలు కట్టడి చేస్తామన్నారు..కొత్త కొలతలన్నారు..‘కార్స్’ వంటి ఆధునిక పరిజ్ఞా నంతో కచ్చితత్వం పక్కా అని చెప్పారు..ఫలితం రికార్డులు తారుమారుతో భూముల కబ్జా. వైసీపీ హయాంలో భూముల రీ సర్వే పేరుతో భూహక్కు పథకాన్ని భూభక్ష పథకంగా మార్చే శాడు జగన్‌రెడ్డి. ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని అమ్ముకోవడం లేదా పేదల భూము లను తనఖా పెట్టాలనే కుట్రలో భాగంగా జగన్‌రెడ్డి భూహక్కు పథకాన్ని తెచ్చాడు. భూ రికార్డులు తారుమారు కాబోవంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చాలానే చేశాడు. మాజీ సైనికుల భూములకు సంబంధించిన వివాదం ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రికి భూముల రీ సర్వే బాధ్యతలు అప్పగించి దొంగ చేతికే తాళాలు ఇచ్చాడు. భూముల రీ సర్వే పేరుతో జగన్‌రెడ్డి అండ్ కో ముఠా రాష్ట్రవ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల ను ఆక్రమించారు. జగన్ కనుసన్నల్లోనే భూముల సరిహద్దులు, రికార్డులను మార్చేసి 35 వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారు.
తప్పుల తడకగా రీ సర్వే
రైతు భూహక్కు-భూరక్ష పథకం గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పిన డబ్బా మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. సమగ్ర సర్వే పేరిట భూ సరిహద్దులను తప్పుల తడకగా మార్చి ప్రజలను ఇబ్బందులు పెట్టాడు. సర్వే ద్వారా రైతుల మధ్య వివాదాలను కూడా పరిష్కరిస్తామని చెప్పి లేని సమస్యలను సృష్టించారు. పిల్లి..పిల్లి కొట్లాటలో కోతి బాగుపడిన చందాన భూముల మధ్య వివాదాలలో జగన్‌రెడ్డి బాగుపడ్డాడు. మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తామని పెద్దమనిషి రంగు పులుముకొచ్చి వివాదాల పరిష్కారా నికి ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని చేతులెత్తిసి రైతులను మోసగించిన ఘనుడు జగన్‌రెడ్డి. భూసర్వే వల్ల నష్టపోయిన వారి ఆక్రోశాన్ని ఏరోజునా పట్టించుకోలేదు. అడ్డగోలు భూ సర్వేకు ఆర్బి ట్రేషనే దిక్కయితే అన్ని వేల కోట్లతో సర్వే ఎందుకు చేయించాడు? అంటే సమాధానం లేదు. కేవలం భూసర్వే పేరిట తను, తన ముఠా దోచుకోవడానికి కాకపోతే ఈ భూ రక్ష పథకం ఎందుకని అనతికాలంలోనే ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు.
సర్వే రాళ్లు, పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ
ఆధునిక సాంకేతికత సర్వేతో వివాదాలు పరిష్కరిస్తారని చెప్పిన జగన్‌రెడ్డి ఏం చేశాడో సమాధానం చెప్పాలి? సర్వే రాళ్లపై జగన్ బొమ్మ ముద్రించుకుని ఆనందపడడానికి రూ. 1,200 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. వీటికి తోడు సర్వే రాళ్లు, ఇతర ఖర్చు లు, సర్వే ఆఫ్ ఇండియాకు సమర్పించే ఖర్చు అదనం. ప్రజాధనంతో రైతుల పట్టాదారు పాస్‌బుక్‌లు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించుకుని మానసిక అనందం పొందాడు. ఈ పథకం కింద భూ రికార్డులు ఇష్టమొచ్చినట్లు మార్చేసి ఎవరి భూములు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో తెలియని అయోమయస్థితికి ప్రజలను తీసుకుని వెళ్లాడు. తూతూమంత్రపు సర్వేతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారి భూములను నిషేధి త జాబితాలో(22-ఏ) చేర్చి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ప్రభుత్వానికి చెందాల్సిన భూములను 22-ఏ జాబితా నుంచి తొలగిస్తూ వేలాది కోట్ల విలువైన భూముల లూటీకి పాల్పడ్డారు. విశాఖలో రూ.35 వేల కోట్ల విలువైన భూములను ఏ1 జగన్‌రెడ్డి, ఏ-2 విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు కాజేశారన్నది జగమెరిగిన సత్యం. భూహక్కు – భూరక్ష పథకం పేరుతో దేవాదాయ భూములు, ప్రైవేటు వ్యక్తుల భూములను కాజేశారు. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి సమాచారం ఇవ్వకుండానే అందుబాటులోని వివరాలు, సరిహద్దుల ఆధారంగా సిబ్బందితో రికార్డులను మార్చేసి అవకతవకలు చేసి రైతులను మోసం చేసిన దగాకోరు జగన్‌రెడ్డి. అన్యాయం జరిగింది అని రైతుల తెచ్చిన 19 వేల అప్పీళ్లను పరి శీలనలోకి తీసుకోలేదు.
కూటమి ప్రభుత్వం ప్రక్షాళన
వైసీపీ ప్రభుత్వం చేసిన భూముల రీ సర్వేలో రైతులకు, భూ హక్కుదారులకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వేలపై ఇప్పటి వరకు 41 వేల ఫిర్యాదులు అందాయి. బాధితులు మా భూములపై మేము హక్కును కోల్పో యామంటూ బోరున విలపిస్తున్నారు. అంటే వైసీపీ పాలనలో రీ సర్వే ఎంత ఘోరంగా జరిగిందో స్పష్టమవుతుంది. రీ సర్వేలో అన్యాయంగా భూముల విస్తీర్ణాలు తగ్గించారని, రికార్డులు చూడలేదని, భూ హక్కు పత్రాల్లో తప్పులు ఉన్నాయని, తమ భూములను మరొక రి పేరుతో ఆన్‌లైన్ చేశారని వేలాదిగా బాధితులు గ్రామసభల్లో ఫిర్యాదు చేశారు. చనిపోయి న వారి పేర్లను అలాగే ముద్రించారని, కొలతలు వేయలేదని, ఇదంతా తమ సమక్షంలో జరగలేదని, రీ సర్వే విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిచిందని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో 21 లక్షల భూ హక్కుల పత్రాలను పంపిణీ చేశా రు. వీటిలో 25 నుంచి 30 శాతం వరకు తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు అందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 16 వేల గ్రామాల్లో 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్త యింది. గ్రామసభల ద్వారా ఆ గ్రామాల్లో జగన్‌రెడ్డి అక్రమాలు మరిన్ని వెలుగులోకి తెచ్చి ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
-తోట నిర్మలాజ్యోతి, అనలిస్ట్