.11 కేసుల్లో ముద్దాయి, 16 నెలల జైలు చరిత్ర జగన్‌రెడ్డిది
.ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడైన రాజకీయవేత్త
.నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి
అమరావతి: 11 కేసుల్లో ముద్దాయి, 16 నెలల జైలు జీవితం అనుభవించిన జగన్ రెడ్డి అవినీతికి పాల్పడినవారిపై ఫిర్యాదుచేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు యథాతథగా.. అవినీతిని అరికడతామని, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతామని, అవినీతి పై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తామని జగన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఏ అధికారి అవినీతికి పాల్పడినా ఏసీబీ 14400 యాప్‌కి ఫిర్యాదు చేయమని జగన్ చెప్పడం విచిత్రంగా ఉంది. లక్షల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన జగన్ అవినీతి గురించి మాట్లాడమే వింతగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఏ విధంగా లక్షల కోట్లు గడిరచాలనే ఒకే ఒక్క ఆలోచనతో జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ఈ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపే దమ్ము, ధైర్యం జగన్ కు లేవు. కొండలు, గుట్టలు, చెరువులు, కట్టలు అన్నింటిని దోచేశారు. ‘యదేచ్ఛగా కంకర, గ్రావెల్, మట్టి తవ్వకాలు’ అని పత్రికల్లో ప్రచురితమవుతున్న వాటిపై ముఖ్యమంత్రి విచారణ జరపగలడా? ‘15 సంవత్సరాలలో రూ.15వేల కోట్లు లాట్రైట్ తవ్వితే వచ్చే అక్రమార్జన- ఓ బినామీ ఫోన్ సంభాషణ లీక్’ అని పత్రికల్లో ప్రచురితమైంది దాని గురించి జ్యుడిషియల్ విచారణ జరిపించగలరా? జగన్ పాలనలో జరుగుతున్న అవినీతి గురించి పత్రికల్లో పుంకాను పుంకాలుగా వస్తున్న వాటిపై విచారణ జరపగలరా? చరిత్ర సృష్టించే విధంగా అవినీతి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులు ఎదుర్కొంటున్నారు. ఇంకా పలు శీర్షికలతో పత్రికల్లో వార్తలొచ్చాయి. అంబులెన్స్, 104 లలో అవినీతి, రివర్స్ టెండరింగ్‌లో అవినీతి, అరబిందో ఫార్మాలో అవినీతి. ఏ విధంగా అక్రమార్జన సంపాదించాలి, ముఖ్య మంత్రి ఆప్తులకు ఎలా కట్టబెట్టాలి, ‘ఏడాదికి రూ.180కోట్లు, అధికార ఆయుధంతో బెదిరింపుల బిజినెస్’, ‘తూర్పుగోదావరి జిల్లా వంతాల గనులలో లాట్రైట్ తరలింపు’ అని పత్రికల్లో వచ్చాయి. దాని పై విచారణ జరపగలరా? ‘ఐటి సలహాదారు మందు దందా… నెలకి రూ.40 కోట్ల ముడుపులు’ అనే శీర్షికతో వచ్చిన వార్తపై విచారణ జరపగలరా? ‘మంత్రి మేనల్లుడా? మజాకా! మద్యంతో మైనింగ్ మాఫియా జట్టు, కోట్ల రూపాయలు అవినీతి, ‘పేదలకు ఇళ్లు పెద్దలకు కోట్లు’ అనే దానిపై విచారణ చేయాలి. రాష్ట్ర మంతటా ప్రతి ఒక్క నాయకుడు ఇళ్ల స్థలాలను ముందుగా తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మి వేల కోట్ల రూపాయలు గడిరచారు. బద్వేల్‌లో వైకాపా నేత భూదందా. నాయకులంతా భూదందా చేస్తే ప్రభుత్వం నిద్రపోతుందా. గుడివాడ గడపలో కడప కబ్జా. పులివెందుల వాళ్లు రాష్ట్రమంతటా కబ్జాకు తయారయ్యారు. విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు, విశాఖని దోచేయడానికి విజయసాయి రెడ్డి ప్రణాళిక, రూ.2 వేల కోట్ల సర్కార్ భూమికే ఎసరు అని పత్రికల్లో వార్తలొచ్చాయి. వాటిపై విచారణ జరపాలి.
రాష్ట్రమంతటా అవినీతి జరుగుతుంటే, ఒక్క అధికారులు మాత్రమే అవినీతి చేస్తున్నట్లు, సీసీ కెమెరాలు పెడతాం, అవినీతిని అరికడతాం అని అనడం ఏంటి?. అవినీతి ప్రక్షాళన మఖ్యమంత్రి, మంత్రుల నుంచి మొదలవ్వాలి. దేశంలో 29 రాష్ట్రాలలో లేని అవినీతి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రూ.1000కి దొరికే ఇసుక నేడు రూ 5వేలకు చేరింది. ఇసుకలోనే దాదాపు రూ.12వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. రూ.250 ఉండే భారతి సిమెంటు ధర నేడు రూ.450కి పెంచారు. రూ.40 లకు దొరికే మద్యం బ్రాండు నేడు రూ.160కి అమ్ముతున్నారు. రూ. 26వేల కోట్ల పైనే మద్యంలో ప్రభుత్వం లూటి చేసింది. మైన్స్ యధేచ్ఛగా అక్రమాలు చేసినిబంధనలు అతిక్రమించారు. చంద్రబాబునాయుడు నీతి, నిజాయితీగా ప్రతి సంవత్సరం కుటుంబ ఆస్తుల వివరాలను బహిరంగంగా వివరిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క సంవత్సరం అయినా తన ఆస్తుల వివరాలను ప్రకటించారా?.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆస్తుల వివరాలకు ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలకు ఎంతో తేడా ఉంది. 2004లో అప్పులలో ఉన్న కుటుంబం నేడు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించిందో ప్రజలకు తెలియజేయాలి. ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తూ ఉంటే అధికారులు ఊరుకుంటారా?
భూములు రిజిష్ట్రేషన్ అయితే ప్రతి లేఅవుట్ లో 40 శాతం లేదా రూ.40 లక్షలు ఇవ్వాలని రేట్లు పెట్టి మరీ వసూల్ చేస్తుంటే ముఖ్యమంత్రి కంట పడటం లేదా? లేకపోతే చూసి కూడ చూడనట్లు కళ్ళు మూసుకుంటున్నారా? బిల్డర్ల్ లేఅవుట్ లు వేస్తే డబ్బులు ఇవ్వాలి. ఇసుకలో, మద్యంలో, ట్రన్స్ ఫర్లకు డబ్బులు ఇవ్వాలి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ అని చెప్పిన రీతిలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి అని చెబుతారు. ఇటువంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్యపదం. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేసులన్నింటికి హాజరై తన నిజాయితీని రుజువు చేసుకోవాలి. ఓటర్లకు ఎందుకు ఓటు వేశామా అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు జగన్ రెడ్డిని నమ్ముకున్నామా అనే పరిస్థితి ఉద్యోగస్తులకు వచ్చింది. సంక్షేమ పథకాలు అన్నింటిలో కోత పెట్టారని రఘునాథ్‌రెడ్డి దుయ్యబట్టారు.