తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జాబు ఎక్కడా… అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ప్రశ్నించారు. యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాబ్ ఎక్కడ జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తూ…. రిక్షా తొక్కుతూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే తలరాతలు మారుతాయని, మీకు మేనమామగా మారుతానని మోసపూరితమైన మాటలను ఎన్నికల సమయంలో చెప్పారని విమర్శించారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మెగా డీఎస్సీని ఏర్పాటు చేస్తానని.. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్‌లో పీజీ, పీహెచ్డీ, బీటెక్, ఎంటెక్ చేసిన యువత రిక్షాలు తొక్కుకుంటూ, ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారని విమర్శించారు. యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఎస్సై కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.