- ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు
- వేల కోట్ల రూపాయలను దారి మళ్లింపు
- అప్పులు చేయాల్సిన దుస్థితిలో సర్పంచ్‌లు
- సమాంతరంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థ
- ఆందోళనలో పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధులు
- నేడు రాష్ట్ర స్థాయి సదస్సు, ముఖ్య అతిథిగా చంద్రబాబు
అమరావతి,చైతన్యరథం: గత నాలుగు ఏళ్ల తొమ్మిది నెలల నుండి రాష్ట్రంలోని గ్రామాలు జగన్‌రెడ్డి కంబంధ హాస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. గ్రామ స్వరాజ్యం సాధన కోసం ఏర్పాటు చేసిన పంచాయితీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసింది. తన పాలనా కాలంలో పంచాయతీయలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. పైగా 14, 15వ ఆర్ధిక సంఘాల ద్వారా పంచాయితీలకు విడుదల చేసిన దాదాపు 8,669 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించింది. తాను గత ఐదేళ్ల కాలంలో పంచాయీతీలకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయాల నిధులను కూడా ఎగనామం పెట్టింది. అంతేకాక గ్రామాల్లో సర్పంచ్‌ల ద్వారా పనులు చేయించి గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిన 36 వేల కోట్ల రూపాయల నరేగా నిధులను వేర్వేరు పనులకు దారి మళ్లించింది. గ్రామాల్లో సర్పంచ్‌లు అభివృద్ది పనులు చేద్దామంటే పంచాయితీల ఖజనాలో ఒక్క రూపాయి లేకుండా చేశారు. ప్రజోపయోగ పనులు చేసేందుకు సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తోంది. ఆ చేసిన పనులకు బిల్లులు లేక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. 14,15 ఆర్ధిక సంఘం నిధులను సక్రమంగా ఖర్చు చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన మరో నాలుగు వేల కోట్ల రూపాయలను నిలిపివేసింది. జగన్‌రెడ్డి నష్టపూరిత నిర్ణయాల కారణంగా మొత్తంగా గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయింది.
ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు
ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలన సాగించేందుకు రాజ్యాంగం ద్వారా హక్కులను పొంది ఉన్న సర్పంచ్‌లను జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సచివాలయ, ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం చేతిలో పెట్టుకొని పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. సర్పంచ్ చెబితే ఒక్క పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. ప్రారంభంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పని చేస్తారని హామీ ఇచ్చినప్పటికీ జగన్‌రెడ్డి ఇచ్చిన అన్ని హామీల్లాగే ఇది కూడా మట్టిపాలు అయ్యింది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంతా పైస్థాయి అధికారులు గానీ, స్థానిక వైసీపీ నేతలు గానీ చెప్పినట్లే వింటున్నారు. నరేగా పనులు సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉండగా కేవలం పంచాయతీల్లో పనుల కోసం తీర్మానం చేయించే వరికే సర్పంచ్‌లను పరిమితం చేశారు. సర్పంచ్ సూచించిన పనులు ఏవీ కూడా నరేగా పథకంలో చేపట్టడం లేదు. చివరకు గ్రామాల్లో పన్నుల రూపంలో వసూలయిన నిధులను కూడా పంచాయితీలకు కేటాయించకుండా ఫ్రీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోంటోంది.
గ్రామాల అభివృద్ధిని నాశనం చేసిన జగన్‌రెడ్డి
ఇంటింటికీ మంచినీరు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులు ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయడంలో, కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకూ పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రంగా ఏపీగా నిలిచింది. ఈపథకం అమల్లో అన్ని రాష్ట్రాల కన్నా ఆఖరి స్థానంలో ఏపీ ఉంది. ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు చాలా పేలవంగా ఉందని జలశక్తి శాఖ సహాయమంత్రి పార్లమెంట్‌లో తెలిపారు. పథకాన్ని చిత్తశుద్దితో అమలుచేయకుండా కుళాయి సెట్లపై అమాతంగా రేట్లు పెంచేసి ప్రజలను మోసం చేస్తున్నారు. రూ. 500 విలువ చేసే కుళాయి సెట్ కు రూ.1250 బిల్లు చేసి అందులో రూ. 300 కమీషన్ కొట్టేసే కుంభకోణానికి పాల్పడ్డారు. కుళాయి మెటీరియల్ సెట్ కొనుగోలు పై రూ. 100 కోట్లు దోచుకుంటున్నారు. ఈ పథకం అమల్లో గత చంద్రబాబు ప్రభుత్వం మొదటి 5 స్థానాల్లో ఏపీని నిలబెడితే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 18వ స్థానానికి దిగజార్చింది. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో నరేగ పనులు కింద రూ. 4,200 కోట్లతో 35.64 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చదిద్దారు. జగన్‌రెడ్డి మాత్రం 5,180 జాబ్ కార్డులు తొలగించి 1,87,407 సభ్యులకు ఉపాధి లేకుండా మొండి చేయి చూపించింది. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా సుమారు 85 టి.యం. సి నీటి సామర్ధ్యాన్ని పెంచి 7 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించడం జరిగింది. కాగా జగన్‌రెడ్డి మాత్రం నీటి ప్రగతికి సబంధించి రూ. 2,650 కోట్లు పైబడి బిల్లులు పెండిరగ్‌లో పెట్టారు.
నరేగా నిధులను స్వాహా చేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఇచ్చిన నరేగా నిధుల్ని మూడురోజుల్లోగా స్థానిక పంచాయతీలకు జమచేయాలనే నిబంధనలకు జగన్ ప్రభుత్వం నీళ్లొదిలింది. ఉపాధిపని కూలీలకు వారంలో కూలీ డబ్బులివాల్సి ఉండగా, 6 నెలలైనా ఇవ్వని దుస్థితి. జగన్ ప్రభుత్వం రూ.8548.29 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని స్వాహా చేసింది. పల్లెల్లో ఉపాధికల్పన కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధిహామీ చట్టం కింద పనికోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు వారంలో పనికల్పించాలనే నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. పనికోసం చేసుకున్న దరఖాస్తులకు నెలలు గడుస్తున్నా మోక్షం లభించడంలేదు. ప్రభుత్వ, వ్యవస్థల నిర్లక్ష్యంతో నిర్ణీతవ్యవధిలోగా పనికల్పించకపోతే, దరఖాస్తుదారుడికి కూలీసొమ్ముతోపాటు పరిహారంగా ఇవ్వాల్సిన సొమ్ముని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదు. కేంద్రం 2019-23 మధ్య రాష్ట్రానికి రూ.8,669 కోట్ల ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. ఇందులో నుంచి రూ.1,500 కోట్లను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిలు రూపేణా ఢస్కింలకు చెల్లించింది. ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన మొత్తంలో నుండి 10శాతం లోపే విద్యుత్తు బకాయిలు చెల్లించాలి. అయితే, రాష్ట్రంలో కొన్నిచోట్ల 24శాతం వరకు మళ్లించగా కొన్ని పంచాయతీల్లో 80-90 శాతం వరకు మళ్లించారని సర్పంచులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నిధులను కూడ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు కూడా వేరే అవసరాలకు మళ్లించింది.
నేడు పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సదస్సు, ముఖ్యఅతిథిగా చంద్రబాబు
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా పలుసార్లు సర్పంచ్‌లు, జెడ్‌పిటీసీలు, ఎంపీటీసీలు నిరసనలు వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి సొంత పార్టీకి చెందిన సర్పంచులే రొడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ సర్పంచులైతే ఎందుకు పనికిరాని పదవి తమకెందుకంటూ రాజీనామాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు తమ బాధలను వ్యక్తం చేసేందుకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ నేతృత్వంలో ఈ సదస్సును బుధవారం మంగళగిరిలోని సికె కన్వెక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరౌతున్నారు. అలాగే మిగిలిన పార్టీల ప్రతినిధులూ హాజరౌతున్నారు. ఈ సదస్సుకు పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్‌పిటీసీలు, ఎంపిటీసీలు, వార్డు మెంబర్లు,కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరౌతారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు పేర్కొన్నారు.