- జే గ్యాంగ్ రాబందుల కన్నా హీనంగా తయారైంది
- శవం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నట్లున్నారు
- జగన్ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మబోరు
- గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
అమరావతి(చైతన్యరథం): గుంట నక్కల కంటే హీనంగా, రాబందుల కంటే రాక్షసంగా జగన్ రెడ్డి తయారయ్యాడని రాష్ట్ర గనులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. శవం ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడు రాజకీయం చేసేద్దామా అనే ఆలోచనే తప్ప ఏ రోజూ ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన రౌడీ హత్యను కూడా రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. గత ఐదేళ్లు పల్నాడులో ఎంతటి భయానక పరిస్థితులు సృష్టించారో ప్రజలందరికీ తెలుసు. అందుకే పల్నాడు ప్రాంతంలో జగన్ రెడ్డి పార్టీని ప్రజలు ఛీత్కరించారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ రాక్షసత్వం చాటుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థల్ని చక్కబెట్టే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వంపై అభాండాలు వేయడం తప్ప జగన్ రెడ్డికి మరో పని లేకుండా పోయింది. పాతకక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేస్తూ.. పల్నాడులో అల్లర్లు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే వినుకొండకు జగన్ రెడ్డి వెళ్లారు. ఐదేళ్లు కనీసం ప్రజల్లోకి రాని వ్యక్తి ఈ రోజు శవం కనిపించగానే వాలిపోవడం జగన్ పైశాచికత్వానికి నిదర్శనమని కొల్లు విమర్శించారు.
ఇదే పల్నాడులో మా బీసీ బిడ్డ తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నడి రోడ్డుపై పీక కోసి చంపారు. కంచర్ల జల్లయ్యను రాళ్లతో కొట్టి చంపేశారు. వందలాది మందిని హతమార్చారు. చివరికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు లాయర్ పారా కిశోర్‌పై హత్యాయత్నం చేశారు. అప్పుడు కనీసం స్పందించని జగన్ రెడ్డి.. ఇప్పుడు రాజకీయం కోసం రావడానికి సిగ్గుపడాలి. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టాడు. బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. కోడికత్తి డ్రామాలాడాడు. ఇప్పుడు పాత కక్షలతో జరిగిన రౌడీ హత్యను మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా.. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. నీ డ్రామాలు, నాటకాలను నమ్మేసేందుకు ప్రజలు పిచ్చివారు కాదని గుర్తుంచుకోవాలని కొల్లు హితవు పలికారు.