- వైసీపీలోని అంబేద్కర్‌వాదులే జగన్ పేరు తొలగించారు
- అంబేద్కర్ కన్నా జగన్ పేరు పెద్దగా పెట్టడం అవమానంగా భావించి ఉంటారు
- విగ్రహం పేరుతో రూ.250 కోట్ల దోపిడీ
- అసత్యాల పత్రికను అడ్డుపెట్టుకుని తప్పుడు కథనాలు
- మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజం
అమరావతి(చైతన్యరథం): విజయవాడలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటూ జగన్ రెడ్డి, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా జగన్ పేరును పెద్దగా పెట్టి.. అంబేద్కర్ పేరును చిన్నగా ఏర్పాటు చేయడంతో వైసీపీలో ఉన్న అంబేద్కర్ వాదులే.. జగన్ రెడ్డి పేరును తొలగించారని… దానిపై ఫేక్ జగన్ రెడ్డి ఫేక్ వార్తలు సృష్టించి టీడీపీపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి డోలా మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
అమరావతి నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఏర్పాట్లు చేస్తే.. తరువాత జగన్ రెడ్డి హడావుడిగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి.. రూ. 170 కోట్ల బడ్జెట్‌ను రూ. 400 కోట్లకు పెంచి రూ. 250 కోట్లకు పైగా కోట్టేశారంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదా అని మంత్రి డోలా నిలదీశారు. దళితులకు మేలు చేస్తానని చెప్పి వారిని జగన్ రెడ్డి మోసం చేసింది నిజం కాదా? అంబేద్కర్ విధానాలను జగన్ రెడ్డి తప్పుదోవ పట్టించాడు. అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన జగన్ రెడ్డి నేరస్థులను ప్రోత్సహించాడు. విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహంపై అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరును పెద్దగా పెటుకోవడం ఆ మహనీయుడిని అవమానించడమే?
అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ పేరు పెద్దగా పెట్టడాన్ని మొదటినుంచీ ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో జగన్ రెడ్డి పేరును వైసీపీ నేతలే తొలగించినట్లు జనం చర్చించుకుంటున్నారు. వైసీపీ నేతలే జగన్ పేరును తొలగిస్తే… ఫేక్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగకున్నా దాడి జరిగిందంటూ మాట్లాడటం సిగ్గుచేటు. అంబేద్కర్ పేరు కన్నా పెద్దగా కనిపిస్తున్న జగన్ పేరును మాత్రమే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. వారు వైసీపీలోని అంబేద్కర్‌వాదులే అయి ఉంటారని మంత్రి డోలా అన్నారు.
విగ్రహం పేరుతో దోపిడీ
గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టుకున్నాడు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించాడు. ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పక్క రాష్ట్రంలో రూ. 170 కోట్లకు ఇదే తరహాలో విగ్రహం కడితే.. ఇక్కడ రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించారు? సాంఘిక సంక్షేమశాఖ చేయాల్సిన పనులను మున్సిపల్ అడ్మిస్ట్రేషన్‌కు అప్పగించి, ఆ బాధ్యతలను కూడా జగన్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి శీలక్ష్మికే ఎందుకు అప్పగించినట్లు? విగ్రహ ఏర్పాటులో అక్రమాలు చేయడానికే ఇలా చేశారు. ఇందులో రూ.250 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని మంత్రి డోలా విమర్శించారు.
అంబేద్కర్ విధానాలు విస్మరించిన జగన్
అంబేద్కర్ విధానాన్ని జగన్ రెడ్డి పూర్తిగా విస్మరించాడు. మద్యం మాన్పించాలని అంబేద్కర్ చెబితే…జనంతో మద్యం తాగించి జగన్‌రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేశాడు. సంపద సృష్టించాలని అంబేద్కర్ చెబితే.. జగన్ ప్రజలపై పన్నులు వేశాడు. పరిశ్రమలను ప్రోత్సహించాలని, మాతృబాషను గౌరవించాలని అంబేద్కర్ చెబితే.. అమ్మ భాషను పూర్తి తుడిచిపెట్టేలా జగన్ చర్యలు చేపట్టాడు. పరిశ్రమలను తరిమికొట్టాడు. పత్రికా స్వేచ్ఛను, పౌరుల స్వేచ్ఛను పూర్తిగా అణగతొక్కాడు? దళిత వర్గాల మీద దాడులు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యను నాశనం చేశాడు. అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ పూర్తిగా ఇవ్వలేదు. అభివృద్ధి విస్మరించి అన్నీ బకాయిలు పెట్టాడని మంత్రి డోలా మండిపడ్డాడు.
అసత్యాల పత్రికలో తప్పుడు కథనాలు
ప్రజలు వాస్తవాలు గ్రహించే జగన్ ను తరిమికొట్టారు. జగన్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంబేద్కర్ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జగన్ పేరును ప్రజలు తొలగించినందుకు ఆ పార్టీ నేతలు సంతోషపడాలి. టీడీపీపై, ప్రభుత్వంపై బురద చల్లేందుకు జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు అర్హత లేదు. ఏ సంక్షేమ పథకం చూసినా బకాయిలే కనిపిస్తున్నాయి.. జగన్ రెడ్డి ఐదు సంవత్సారాలు చేసిన పాపాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో బాత్‌రూమ్ లకు తలుపులు కూడా పెట్టించలేని వ్యక్తి జగన్ రెడ్డి. అసత్యపు పేపర్‌ను అడ్డుపెట్టుకుని రోజుకో తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. జగన్ రెడ్డి పేరు తీసేయడంతో నేడు నిజమైన అంబేద్కర్ వాదులందరూ చాలా సంతోష పడుతున్నాని మంత్రి డోలా అన్నారు.