.హామీలు నెరవేర్చమంటే నిర్బంధాలెందుకు?
.వారేమైనా ఉగ్రవాదులా.. ఏమిటీ నియంతృత్వం
అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేయడమే సీపీఎస్ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపడం దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలను ఖండిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అడ్డగోలుగా హామీలిచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఉద్యోగుల డిమాండ్ల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ని తిరిగి ప్రారంభిస్తానని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమంటే సీఎం జగన్‌రెడ్డి అభద్రతాభావంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఓపిఎస్ అమలు చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలో శాంతియుత నిరసనలకి పిలుపునిస్తే..99 శాతం మంది ఉద్యోగులపై బైండోవర్లు, ముందస్తు నిర్బంధం, అక్రమ అరెస్టులు చేయడం నిరంకుశపాలనకి పరాకాష్టగా మారిందన్నారు. పోలీసుల వేధింపులు, బెదిరింపులు, బాండ్లు రాయించుకోవడంతో తీవ్ర ఆందోళనకి గురైన ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11కి వాయిదా వేసుకున్నా.. కక్ష కట్టినట్టు పోలీసులు స్కూళ్లలో చొరబడి భయకంపితులు చేయడం చాలా దారుణమని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ఉద్యోగుల కుటుంబసభ్యులని బెదిరించే స్థితికి జగన్‌రెడ్డి దిగజారిపోవడం సర్కారు పతనానికి సంకేతమని హెచ్చరించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జగన్‌రెడ్డి సర్కారు ఉద్యోగులు, ఉద్యోగసంఘ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, బైండోవర్లు అన్నీ బేషరతుగా ఎత్తేయాలన్నారు. ఉద్యోగులకి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని లోకేష్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.