- జనం ఛీకొట్టినా మారని తీరు
- ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించింది
- దిగజారుడు రాజకీయాలతో జగన్ దుష్ప్రచారం
- వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
అమరావతి(చైతన్యరథం): అబద్ధాలు జన్మ నక్షత్రంగా పుట్టిన జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాలా అండగా నిలబడితే నిస్సిగ్గుగా జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బాధితులకు అందుతున్న పరిహారంపై కూడా దిగజారి రాజకీయాలు చేస్తున్న జగన్‌రెడ్డిని ప్రజలు క్షమించరని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు అన్నారు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. ధర్నా చేస్తానని జగన్‌రెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం? నష్టపోయిన ప్రజలకు లబ్ధి చేకూర్చడం జగన్‌కు ఇష్టం లేదా? జగన్ అబద్ధాలకు అంతే లేకుండా పోతోంది.
సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం, అంబులెన్స్‌లు వచ్చి వైద్యం అందిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జగన్ ఏ విధంగా మాట్లాడతారు. మీ అబద్ధాలు నమ్మబోమని ముఖం మీద కొట్టినట్లుగా చెప్పిన జనం 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు బాధితులందరికీ పరిహారం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో జగన్ ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు.
దుర్ఘటన జరిగిన తరువాత 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.1 లక్ష పరిహారంతో సరిపెట్టిన విషయం వాస్తవం కాదా? ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలంటూ నిరసన తెలియజేసిన 30 మందిపై గోపాలపట్నం స్టేషన్లో కేసు పెట్టింది జగన్‌రెడ్డి కాదా? వైసీపీ హయాంలో పరిహారాల కోసం రోడ్డెక్కని బాధితులెవరైనా ఉన్నారా? ద్విచక్ర వాహనాలపై రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు వైసీపీ హయాంలో కోకొల్లలుగా జరిగాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.