- రూ.500 కోట్లతో 20వేలకోట్ల భూములకు ఎసరు
- లేపాక్షి దోపిడీ పూర్తయ్యాక వాన్ పిక్ పై పడతాడు
- జె-బ్రాండ్ల ద్వారా రాష్ట్రంలో డిల్లీని తలదన్నే స్కామ్
- ఈసారి పులివెందులలోనూ జగన్ కు ఓటమి తప్పదు
- జగన్ రెడ్డిని జనం తరిమే రోజులు దగ్గర్లోనే
- పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు
- వైసిపి రౌడీలు, కిరాయిమూకల ఆటకట్టిస్తాం
- తప్పుడుకేసులపై పోలీసులు పద్ధతి మార్చుకోవాలి
- కుప్పం నియోజకవర్గంపై వైసిపినేతల కక్ష
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
కుప్పం : ముఖ్యమంత్రి జగన్ ఒక కరుడు గట్టిన ఆర్థిక ఉగ్రవాది. వైఎస్ హయాంలో కమిషన్‌లు తీసుకుని అనుమతిచ్చిన కంపెనీలను పూర్తిగా హస్తగతం చేసుకుంటున్నాడని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. లేపాక్షి హబ్ దివాలా తీసిందని చెప్పి ఇప్పుడు 500 కోట్లు ఇచ్చి వేల కోట్ల భూమి కొట్టేస్తున్నడు. 20 కోట్ల టర్నోవర్ గల చిన్న కంపెనీ కంపెనీ 500 కోట్లు పెట్టి 20 వేల కోట్లు కొట్టేస్తుంది. లేపాక్షి అవ్వగానే..వాన్పిక్ ప్రాజెక్ట్ పై పడతారని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి రామకుప్పం మండలంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడారు.
ఎపిలో డిల్లీని మించిన చీప్ లిక్కర్ స్కామ్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో డిల్లీని మించిన చీప్ లిక్కర్ స్కామ్ నడుస్తోందని చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు.జగన్ ఇంటికి 10వేలు ఇచ్చి లక్ష రూపాయలు దోచేస్తున్నాడు. పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చి వైసీపీ నేతలు ఇక్కడ అమ్ముతున్నారు. ఇది వరకెన్నడూ లేనివిధంగా జె-బ్రాండ్స్‌తో జగన్ అడ్డగోలు దొచేస్తూ మహిళల మాంగల్యాలను మంటగలుపుతున్నా డు. ఢిల్లీ లిక్కర్‌స్కాం కంటే పెద్దస్కాం జె-బ్రాండ్స్ ద్వారా ఎపిలో కొనసాగుతోందని అన్నారు.
ఈసారి జగన్‌కు పులివెందులలో కూడా ఓటమి తప్పదు
పంచాయతీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచామని పుంగనూరు పుడిరగి ఎగిరెగిరి పడుతున్నారని చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. ఏమీ చేశారని ప్రజలను జగన్ ఓట్లు అడుగుతారు. బాబాయ్‌ను చంపాను అని ఓట్లు అడుగుతారా? నేను పులివెందులను కుప్పంలా అభివృద్ధి చేద్ధామని అనుకున్నా. మీరు కుప్పాన్ని పులి వెందుల చెయ్యాలి అనుకుంటున్నారు. ఒకరిద్దరు రౌడీఇజం చేస్తే టీడీపీ భయపడదు. వైసీపీ 175 గెలవడం కాదు.. ఈ సారి పులివెందుల కూడా ఓడిపోతారు.
కుప్పంపై కక్షగట్టిన జగన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇతర వైసిపి ముఖ్య నేతలు కుప్పం నియోజకవర్గంపై కక్షగట్టారని, ఎన్నడూ లేనివిధంగా చోటామోటా నాయకులు ఇక్కడ రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల వేషాలు ఇక్కడ వేస్తే కుదరదు.. నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? మీకు టిడిపి కార్యకర్తలు తగువిధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తన మూడురోజుల పర్యటనలో భాగంగా బుధవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో టిడిపి అధినేత విస్తృతంగా పర్యటించారు. శాంతిపురం మండలం కొంగణపల్లి రోడ్ షోలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. కుప్పంలో వైసీపీ నాయకులు వేషాలు వేస్తే తోకలు కత్తిరిస్తా.. ఇది నా నియోజకవర్గం.. కొం దరు ఇక్కడ పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తు న్నారు.. వారి ఆటలు సాగనీయబోమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పర్యటనలో వైసీపీ జెండాలు కట్టి కేడర్ ను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అధినేత పేర్కొన్నారు. వైసీపీ సర్కారు ఎన్ని రోజులు ఉంటుందో ఆ పార్టీవారికే తెలియడం లేదని అన్నారు. పోలీసులు న్యాయం గా ఉండాలి.. మాట్లాడితే టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తున్నారు, వారు పద్ధతి మార్చుకోవాలి. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. రేపు అనేది ఒకటి ఉంది… అందరి ఆటలు కట్టిస్తామని అన్నారు.
కుప్పం నియోజకవర్గంపై వైసిపినేతలకు కక్ష
కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపివేస్తున్నారు? టిడిపి అధికారంలోకి వచ్చాక ఇక్కడ నిలిపివేసిన పథకాలు వడ్డీతో సహా అందించే ఏర్పాటుచేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోకవర్గంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.. నేను కుప్పం నుంచి ప్రాతిధ్యం వహిస్తున్నానని ఇక్కడ ఏ పనులు చేయడం లేదు, హంద్రీనీవా పనులు పూర్తి చేయలేదని అన్నారు. కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం..వాటిని నిలిపివేశారు.
కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం. కుప్పం కు రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు 65 కోట్లు ఇస్తామని అంటున్నారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. మేం అధికారంలో ఉన్నపుడు ఓట్లు వేయ లేదని నేను పులివెందులలో పనులు నిలిపివేయలేదు, పులివెందులలో ఎవరి పింఛన్లు తొలగించలేదని తెలి పారు. తాను సిఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు గండికోట జలాశయం ద్వారా నీరందించానని చెప్పారు.
నరేగా నిధులు ఎవరు తిన్నారో సమాధానం చెప్పండి
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజిలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడా తట్టెడు మట్టి కూడా వేయలేదు, నరేగా నిధులు ఎవరు తిన్నారో సమాధానం చెప్పాలని చంద్రబాబునాయడు నిలదీశారు. కుప్పం ప్రజల గుండెల్లో టీడీపీ జెండా ఉంది, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయన్నారు. నవరత్నాలు అని చెప్పి..నవకోతలు పెడుతున్నారు, పెన్షన్లు కట్ చేస్తే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ఎవరి ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. టీడీపీ రాగానే కుప్పం నియోజకవర్గంలో నిలిచిన పనులు నెలరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమమనేది లేనేలేదు..జనంపై బాదుడే బాదుడు అంటూ వరుస భారాలతో ఇబ్బందులు పెడుతున్నారు. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్ అంటున్నారు. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారని అన్నారు.
10 మందికి మందుపోసి నా టూర్ చెడగొడతారా?
ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం చేసుకుంటే మరో పార్టీ వారు అక్కడికి రారు. కానీ కుప్పం లో నా పర్యటనకు వైసిపి గూండాలు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నించారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రామకుప్పం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్ షో లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..వీళ్ళ బెదిరింపులకు మనం భయపడతమా? టీడీపీ కార్యకర్తల పై దాడి చేసిందే కాకుండా మళ్ళీ రేపు కేసులు కూడా పెడతారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ని కట్టడి చెయ్యలేరు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చేసి పైశాచిక ఆనందం పొందారు. జగన్ ఈ సారి కుప్పం కూడా గెలవడం కాదు..ముందు పులివెందుల గెలవాలి. ప్రశాంతతకు మారు పేరైన కుప్పం లో డ్రామాలు మొదలు పెట్టారు. 10 మంది రౌడీ లను మందు పోసి మాపై పురిగొల్పుతున్నారు. పోలీసులు ఇంతలా నిర్వీర్యం అయితే ఎలా?జె-గ్యాంగ్ దగ్గర అవినీతి డబ్బు ఉంది..కుప్పానికి ఎన్నికల్లో లారీల్లో డబ్బు పంపుతాడు. అవినీతి డబ్బు మన కుప్పం ప్రజలకు వద్దు. ఇక్కడ గ్రానైట్ దోచేస్తుంటే వెళ్ళడానికి మాకు హక్కు లేదా? ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చెయ్యాలా అని నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని రాజకీయాల్లో ఉన్నాను..ఉంటాను. కుప్పంలో ఎంతమంది నా కులం వాళ్ళు ఉన్నారు.నాకు కులం అంటగడతారా? అందుకే కులం పేరు ఎత్తితే చెప్పు చూపించమని చెప్పాను. కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి. జగన్ కు మానవత్వం ఉందా..నెల్లూరు లో దళితుడు ప్రాణం పోయినా స్పందించరా? నెల్లూరులో కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు సెటిల్మెంట్ చేస్తారా?కుప్పం లో నాడు ఆవులు పంపిణీ చెయ్యడం వల్ల ప్రజల ఆదాయం పెరిగింది. ఇప్పుడు బలవంతం గా అమూల్ కు పాలు పోయాలని వొత్తిడి చేస్తున్నారు. పుంగనూరు లో పెద్ది రెడ్డి డైరీ లో లీటరు పాలకు 18 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మనం ప్రశ్నించిన తరువాత రేటు పెంచారని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.