- 11 సీట్లకు పరిమితమైనా ఇంకా ప్రజాభిప్రాయం బోధ పడలేదు
- మళ్లీ అధికారం కోసం అంతులేని ఆరాటం
- రాష్ట్రంలో హింస, హత్యలకు జగన్‌రెడ్డి కుట్ర
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం
అమరావతి(చైతన్యరథం): హింసాకాండను ప్రేరేపించి, హత్యలు జరిపించి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదని ప్రచారం చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి పెద్ద గోబెల్స్ రెడ్డి అని..11 సీట్లకు పరిమితమైనా జగన్‌కు ఇంకా ప్రజాభిప్రాయం అర్థం కావడం లేదన్నారు. గతంలో కొలంబియా దేశంలో కల్లోలం సృష్టించిన డ్రగ్ స్మగ్లర్ ఎస్కోబార్‌కు జగన్ రెడ్డికి పెద్ద తేడాలేదన్నారు. అధికారం కోసం జగన్ రెడ్డి కుతంత్రాలు పన్నుతూ దుర్మార్గపు, దుష్ట ఆలోచనలు చేస్తున్నాడని వర్ల మండిపడ్డారు.
పోయిన అధికారాన్ని ఎలాగైనా తిరిగి పొందాలని జగన్ ఆరాటపడుతున్నాడు. ప్రజలు జగన్‌ను ఛీ కొట్టి.. చంద్రబాబును జై కొట్టారనే విషయం ఇంకా అర్థం చేసుకోలేక పోగా.. కొత్త కుట్రకు తెరలేపాడు. ఆ కుట్రను అమలు చేయడానికి కోట్ల రూపాయాలు ఖర్చుచేయానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే.. పత్తికొండలో శ్రీనివాసులు అనే టీడీపీ నాయకున్ని దారుణంగా హత్య చేయించడం. రాష్ట్రంలో కొన్ని హత్యలు చేయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పాలనదే జగన్ ప్రణాళిక అని జనం చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను కళ్లలో కారం కొట్టి దారుణంగా నరికి చంపారు. ఈ హత్య జగన్‌కు తెలిసే జరిగింది. కుట్రలతో జనాలను చంపి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి జగన్ యత్నిస్తున్నాడు.
రాజకీయ హత్యలంటూ ఢల్లీి వెళ్లి గగ్గోలు పెట్టిన జగన్.. హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్పమని అడిగితే దొంగకు తేలు కుట్టినట్లు కిమ్ముమనకుండా ఉన్నాడు. జగన్ రెడ్డికి దైర్యం ఉంటే ఆ 36 మంది పేర్లు చెప్పాలని సవాల్ చేస్తున్నా. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదెప్పను చంపింది వైసీపీ నేతలే కదా? ఆళ్లగడ్డలో శ్రీదేవి, తాడిపత్రిలో లాల్‌బాషా, పత్తికొండలో గోపినాథ్ చౌదరి, దుగ్గిరాలలో కాశీం, నేడు మళ్లీ పత్తికొండలో శ్రీనివాసులు..ఇలా ఏడుగురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు పక్కా ప్రణాళికతో హతమర్చింది నిజం కాదా? జగన్ రెడ్డి అన్ని నియోజకవర్గాలకు డబ్బులు పంపి అరాచకం సృష్టించి అమాయకులను చంపాలని ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని వర్ల రామయ్య దుయ్యబట్టారు.
జగన్ కుట్రలను బయటపెట్టాలి
ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమై జగన్ రెడ్డి కుట్రను బహిర్గతం చేయాలి. ఇకపై రాష్ట్రంలో ఒక్క హత్య కూడా జరగకుండా చూడాలి. రాష్ట్రంలో శాంతి, భద్రతలను ఎలా కాపాడాలో, ఎలా నిర్వహించాలో తెలిసిన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేరు. ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టాలి. జగన్ ఇంటిపై నిఘా పెట్టాలి. జగన్ ఏం చేయబోతున్నాడో, ఎవరెవర్ని కలవబోతున్నాడో, అతని దుర్మార్గపు ఆలోచనలను ఎప్పటికప్పుడు కనిపెట్టాలి. దుర్మార్గపు సొమ్ము, దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న నేతలపై నిఘా పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని వర్ల రామయ్య కోరారు.