.గుడివాడ క్యాసినోలో చేతులు మారిన డబ్బు రూ.180 కోట్లు
.8 నెలలు గడిచినా విచారణ లేదు
.జూన్‌లో నేపాల్ వెళ్లిన వైసీపీ నేతల పేర్లు బయటపెట్టే దమ్ముందా?
.మన డబ్బు రూ.మిలియన్ల కొద్ది నేపాల్, లావోస్ తిరిగి రాష్ట్రానికి రాక
.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టాలి
.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి: రాష్ట్రంలో విపరీత ధోరణితో పాలన సాగుతోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంక్రాంతి సమయంలో గుడివాడలో ఆనాటి మంత్రి కొడాలి నాని నిర్వహించిన క్యాసినో జూదంలో వేలాది మంది తమ డబ్బులు వదిలించుకుని రోడ్డున పడ్డారు. పది వేల రూపాయల ఎంట్రీ టికెట్‌తో దాదాపు 18 వేల మంది పాల్గొన్నారని, తద్వారా రూ.180 కోట్లు చేతులు మారాయి. ముఖ్యమంత్రి సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో సీఎం ఆలోచించాలి. గేమింగ్, డ్యాన్సులు, లోన-బయట, తీన్ పత్తీ, బ్లాక్ జాక్.. ఇలా ఇష్టమొచ్చినట్లు ఆటలు సాగాయి. గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. క్యాసినో జరిగిన ప్రాంతానికి మమ్మల్ని వెళ్లనీయలేదు. ఈ కేసులో పోలీసులు తప్పించుకోలేరు. అక్కడ ఏమీ జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చారు. డీజీ సవాంగ్, ఎస్పీ సత్యానందం, విచారణ అధికారిగా ఉన్న శ్రీనివాస్, పోలీసులకు ముసలం పుట్టింది. శాసనసభలో ప్రస్తావిస్తే రిపోర్టు కాల్ ఫర్ చేస్తున్నాం, వస్తుంది అన్నారు. ఆ రిపోర్టు ఏమైందో ఇంతవరకు తెలియదు. సీఎంకు అవినీతి అంటే ఇష్టం. అవినీతి చేసేవారిని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలను చాలా గౌరవంగా పలకరిస్తారు. క్యాసినో గురించి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఆనాడే చికోటి ప్రవీణ్ గురించి చెప్పాం. అతను వంశీకి అత్యంత సన్నిహితుడని చెప్పాం. దీనిపై ఎలాంటి విచారణ జరపకుండానే 8 నెలలు కాలం గడిపేశారు. ఈ క్యాసినో వ్యవహారం రావణకాష్టంలా కాలుతూనే ఉంది. కేరళ రాష్ట్రం నుంచి వందలాదిమంది గుడివాడలో జరిగిన ఈ క్యాసినోకి వచ్చారు. ఇక్కడ గేమ్ వన్ సైడ్‌గా జరిగిన విధానాన్ని చూసి కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కేరళ వాళ్లు ఏపీకి వెళ్లి కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వైనం చూసి కేరళ ప్రభుత్వం కూడా నివ్వెరపోయింది.
జూన్ 10,11,12,13 తేదీలలో నాలుగు రోజులు నేపాల్‌లోని జపా జిల్లా మోచీనగర్‌లో హోటల్ మోచీక్రౌండ్‌లో ఆల్ ఇన్ వన్ ఈవెంట్ పేరుతో మాజీ మంత్రి కొడాలి నానీ, శాసనసభ్యుడు వంశీ సన్నిహితుడు చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. ఏలూరు, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విజయవాడ, విశాఖపట్నం నుంచి జూదక్రీడాకారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీరికి చికోటి ప్రవీణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు వసూలు చేశారు. మందు, విందు సకల సౌకర్యాలు కల్పించారు. ఆ ఫ్లైట్‌లో సగం మంది అధికార పార్టీకి చెందిన మాజీ బూతుల మంత్రి, ఎమ్మెల్యే వంశీ తదితరులు వెళ్లారంటున్నాను. ధైర్యం ఉంటే వారి వివరాలు బయట పెట్టాలి. అధికారపార్టీకి సంబంధించిన పెద్దలు నల్లధనాన్ని వైట్ అమౌంటుగా మార్చుకుంటున్నారు అనేది సమాచారం. మన రూపాయిని నేపాల్ కరెన్సీగా చికోటి ప్రవీణ్ బృందం మార్చి మనీ లాండరింగ్ చేస్తారు. ఈ ధనాన్ని లావోస్‌లోని వారి బ్యాంకు ఖాతాలలో నిక్షిప్తం చేస్తారు. లావోస్‌లోని డబ్బు ఆంధ్రప్రదేశ్‌లోకి మిలియన్లకు మించి రావడంతో ఆర్బీఐ కూడ ఉలిక్కిపడిరది. అధికార పార్టీ వైసీపీకి చెందిన వారి అనేక మంది గుట్టు రట్టవుతుంది. ఇక్కడి డబ్బు నేపాల్, లావోస్ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా చేరిందో వివరంగా అన్ని నిజాలు నిర్థారి తమవుతాయి. వర్ల రామయ్య అనే నా మీద అక్రమంగా కేసులు పెట్టించడంలో చూపించిన శ్రద్ధ తప్పుదోవ పడుతున్న నాయకులని దారిలో పెట్టడానికి చూపించుంటే నేడు ఈ దుస్థితి పట్టేది కాదు. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్షుణ్ణంగా విచారణ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.