- ఐదేళ్ల అరాచకాలు, విధ్వంసం వల్లే జనం ఛీ కొట్టారు
- నిజాలు మరిచి ప్రజలపై నిందలా
- జగన్ మొసలి కన్నీరు జనం నమ్మరు
- రక్తం అంటిన చేతులతో గవర్నర్‌కు ఫిర్యాదు సిగ్గుచేటు
- అధికారుల లెక్కలన్నీ తేలుస్తాం
అమరావతి(చైతన్యరథం): ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోకుండా జనాలపై నిందలు వేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి తరవాత జగన్ మాట్లాడిన మాటలు ఆత్మస్తుతి, పరనిందలా ఉన్నాయన్నారు. తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు. జగన్ బటన్ నొక్కితే జనం ఓటేయాలా? జగన్ చేసిన ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు. జగన్‌రెడ్డి ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు. ప్రజలందరూ ఏకగ్రీవంగా ఈ జగన్ మాకొద్దు అంటూ ఓట్లు వేశారు. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయినా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులను నిందించటం వేయడం సిగ్గుచేటు. వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణమని వర్ల స్పష్టం చేశారు.
గతం మరిచి ఫిర్యాదులా..
మాచర్లలో జరిగిన రాక్షసకాండను జనం మరచిపోలేదు. సిగ్గులేకుండా మళ్లీ గవర్నర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అందరికీి తెలుసు. మాచర్లకు వెళ్లిన బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై ఐరన్ రాడ్లతో దాడిచేసినప్పుడు అవి నేరాలు, ఘోరాలు కాదా? మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో వైసీపీ నేతల అరాచకాలకు భయపడి 250 ఎస్సీ కుటుంబాలు ఆ ఊరిని విడిచి వెళ్లిపోయాయి. అప్పుడు మా అధినేత చంద్రబాబు వారిని స్వగ్రామంలోకి తీసుకెళ్లాలని బయలుదేరితే ఆయన బయటకు రాకుండా ఇంటిగేటుకు పోలీసులు తాళ్లుకట్టారు.
అప్పుడే చంద్రబాబు చెప్పారు.. నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లు మీ అధికారానికి ఉరితాళ్లుగా మారతాయని. నేడు ఆ మాటలే నిజమయ్యాయి. నేడు గవర్నర్ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు కల్లబొల్లి ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రచార రథంపై ఉన్నా కూడా హత్యాయత్నం కేసులు పెట్టి వేధించారు. టీడీపీ అరాచకం చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఎవరూ మిగలరు. అది మా పంథా కాదు… మా అధినేత దానికి ఒప్పుకోరు. మా నాయకుడు ఒక్క కనుసైగ చేస్తే మీరు ఏమవుతారో తెలుసా? కౌంటింగ్‌లో రెండో రౌండ్‌కే మీ నేతలు పారిపోయారు. మీరు నేరాలు, ఘోరాలు చేశారు కాబట్టే రాష్ట్రాన్ని విడిచి పారిపోయే దుస్థితి వచ్చింది. మీరు గవర్నర్ వద్దకు వెళితే జనం నమ్ముతారా? ఇసుక, వైన్, ల్యాండ్, మైనింగ్ దేన్నీ వదలకుండా దోచుకున్నారు. వంద కోట్లు తిన్న రాబందులా.. మూతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుని గవర్నర్ దగ్గరకు వెళితే నమ్ముతారా అని వర్ల ప్రశ్నించారు.
దమనకాండను దళితులు మర్చిపోలేదు
ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితుల మనసులు కరగవు. నా ఎస్సీలు, నాఎస్టీలు అన్నారు… వారి కోసం ఏం చేశారు? 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 2 మాత్రమే వైసీపీ గెలిచింది. మిగిలిన 27 కూటమి గెలిచింది. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని.. నిరంకుశ, నియంతృత్వ, ప్రజావ్యతిరేక పాలనను ఎస్సీలు ఛీ కొట్టారని ఎన్నికల ఫలితాలతో అర్థం అవుతోంది. ఆ రెండు సీట్లు కూడా మా వారు చేసిన చిన్న పొరపాటు కారణంగానే వైసీపీ గెలిచింది. ఎస్సీలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు. ఇకనైనా జగన్ పరనింద మానుకోవాలని వర్ల హితవు పలికారు.
ఓట్లు వేయలేదని ఏడుపు మొఖంతో జగన్ మాట్లాడతున్నాడు. జగన్ రెడ్డి ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారు. అందుకే దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిరచారు. జగన్‌రెడ్డి పాలనలో దళితులపై జరిగిన దమనకాండను ఆ వర్గీయులెవరూ మర్చిపోలేదు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌ను చంపేశారు. ఇసుక దందా జరుగుతోందని చెప్పినందుకు పోలిస్‌స్టేషన్‌లో వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. దళిత బిడ్డపై వైసీపీ వర్గాలు సామూహిక అత్యాచారం చేసి పోలిస్టేషన్ ముందు పడేశారు. మాస్క్ పెట్టుకోలేదని దళిత బిడ్డ కిరణ్ కుమార్‌ను పోలీసులు కొట్టి చంపేశారు. కల్తీ మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతుండటంపై మాట్లాడిన ఓంప్రతాప్‌ను తెల్లారేసరికి చంపేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు. పులివెందులలో దళిత మహిళ నాగలక్ష్మిని కొట్టి అత్యాచారం చేసి చంపేశారు. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్న హత్య చేశారు. నకరికల్లులో గిరిజన మహిళను, టంగుటూరు దగ్గర దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి చంపేశారు. అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పటాన్ని కూడా మా దళిత బిడ్డలు మరిచిపోలేదని వర్ల అన్నారు.
అధికారుల లెక్కలన్నీ తేలాలి
కొల్లి రఘురామరెడ్డి, సునీల్‌కుమార్, డిప్యుటేషన్‌పై వచ్చి వైసీపీ నేతల అరాచకాలకు సహకరించిన అధికారుల లెక్కలన్నీ తేలాలి. చట్టబద్ధంగానే వీరిపై చర్యలు ఉంటాయి. జగన్ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లలో ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. జగన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి. కానీ ఎప్పుడూ హాజరు కాలేదు. జగన్ రెడ్డికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారో కోర్టు స్పష్టత ఇవ్వాలి. ఆయన మీద ఉన్న 11 కేసుల్లో వెంటనే విచారణ చేపట్టి నిర్దోషి అయితే వదిలేయాలి.. దోషి అయితే శిక్ష విధించాలి. జగన్ ఇకనైనా మొసలి కన్నీరు ఆపాలి. జగన్ రెడ్డి భవిష్యత్‌లో చెల్లించాల్సిన మూల్యం చాలా ఉందని వర్ల స్పష్టం చేశారు.