- వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటు
- మంత్రి డోలా మండిపాటు
అమరావతి(చైతన్యరథం): ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని దుయ్యబట్టారు. సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీపై తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది. వినుకొండలో జరిగిన హత్యకు ముఖ్యకారకుడు జగనే. వైసీపీ హయాంలో హతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేదా? నాడు జగన్ చేసిన పాపానికి మూల్యం ఒక వ్యక్తి నిండు ప్రాణం. వైసీపీ హయాంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నాడు ప్రతిపక్ష నేతల్ని బయట తిరగకుండా అడ్డుకున్న పిరికిపంద జగన్. గతంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేతలు పరామర్శించకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని జగన్ నియంతృత్వంగా వ్యవహరించారు. కానీ నేడు టీడీపీ పాలనలో జగన్ స్వేచ్ఛగా తన పర్యటనలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలి. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ప్రజలే జగన్‌ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తారని ఒక ప్రకటనలో డోలా హెచ్చరించారు.