- ప్రజాభిప్రాయ సేకరణలో పలువురి ఆందోళన
- ఏపీఈఆర్‌సీ ఆధ్వర్యంలో రెండోరోజూ సూచనలు
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్న చైర్మన్ రామ్‌సింగ్
అమరావతి(చైతన్యరథం): ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బుధవారం కూడా జరిగింది. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్, మెంబర్ పి.వెంకటరామరెడ్డి విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రత్యక్షంగా 14 మం ది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 25 మంది తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. మొత్తం రెండురోజుల్లో 60 మంది తమ అభ్యంతరాలు, సూచనలు తెలిపారు. ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకురాగా చైర్మన్ ఠాకూర్ రామసింగ్ మాట్లాడుతూ వినియోగదారులు, ప్రజా సంఘా లు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అంశా న్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.
గత ప్రభుత్వం వల్లే విద్యుత్ ఛార్జీల భారం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే నేడు వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుందని తెలిపారు. అదనపు ఛార్జీలు కట్టలేని పేద, మధ్యతరగతి వినియోగదారులకు సమయం ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేయవద్దని సూచించారు. విద్యుత్ ప్రమాద బీమాను పెంచాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధం అయిన బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. అలాగే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి కండక్టర్లను కూడా మార్చాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్‌లకు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపే కనెక్షన్లు ఇవ్వాలని, సిబ్బంది కొరత సమస్య తీర్చాలని కోరారు.
విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి
కాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ఏపీఈఆర్సీపై ఎంతైనా ఉందన్నారు. ట్రూఅఫ్ ఛార్జీలపై సమీక్షించుకో వాలని సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెకీ, అదాని ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవీ ఆంజనేయులు మాట్లాడు తూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటతో వినియోగదారులకు లాభం కలుగుతుందని చెబుతున్నారని, ఇది పునరాలోచించుకోవాలని సూచించారు. మన దేశంలోనే బొగ్గు లభిస్తున్నా విదేశీ బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో వినియోగదారులపై భారం పెరుగు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌పీసీఏ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని కోరా రు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి పి.కోటిరావు మాట్లా డుతూ గ్రీన్ పవర్‌ను ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ టారీఫ్‌లు, అదనపు ఛార్జీల భారంపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాజేష్‌బాబు మాట్లాడుతూ పరిశ్రమలకు విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ఇవ్వాలని, అప్పుడే పరిశ్రమల స్థాపన జరుగుతుందని సూచించారు. తమ పరిశ్రమకు మూడేళ్లలో రూ.3.5 కోట్లకు పైగా బిల్లులు చెల్లించానని వివరించారు. అలాగే తాతా సుబ్రమణ్యం, కుమార స్వామి, తాతినేని వేంకటేశ్వరరావు, పి.సాంబశివరావు, జీవా, గణేష్, హనుమయ్య అభిప్రాయాలు తెలిపారు. తిరుపతి నుంచి గురుస్వామి నాయుడు మాట్లాడుతూ కనీసం వంద యూనిట్ల వరకు ఒక స్లాబ్ ఉండేలా మార్పు చేయాలన్నారు. వ్యవసాయా నికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి గోపాలకృష్ణ మాట్లాడుతూ చేపల చెరువుల సాగు నష్టాలను మిగుల్చుతుం దని, 5 ఎకరాల లోపు చెరువులు ఉన్న వారికి అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీని అన్ని చేపల చెరువులకు అమలు చేయాలని సూచించారు. అలాగే సిగ్మా సీఈవో గోపీనాథ్, ఎం.ఎస్.శర్మ, హర్షకుమార్, హిమాన్ష్ చావ్లా, డి.వి.లక్ష్మీనారాయణ, చీకటి శ్రీనివాస్ తదితరులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి అధికారులు, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.