– దళిత, బీసీ, మైనారిటీలపై వైసీపీ నేతల దమనకాండకు జగన్ ఇస్తున్న ధైర్యమే కారణం
– పోలీస్ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరిచి చట్టప్రకారం వ్యవహరించాలి
– జగన్ రెడ్డి మోసాల్ని, తమ వర్గానికి చెందిన మంత్రుల చేతగానితనాన్ని దళిత, బీసీ, మైనారిటీలు తెలుసుకోవాలి
– సామాజిక సాధికార యాత్ర.. కేవలం ఎన్నికలకోసం జగన్ తలపెట్టిన యాత్రే
అమరావతి: వంద ఎలుకలు తిన్న పిల్లి.. కైలాసానికి వెళ్తానన్నట్టుగా, నిత్యం దళితులపై దమన కాండకు పాల్పడుతున్న జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం సామాజిక సాధికార యాత్ర పేరుతో దళితుల జపం చేయడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. నాలుగేళ్ల 8 నెలల జగన్ పాలనలో ఇప్పటివరకు ఎస్సీలపై 6వేలకు పైగా దాడులు జరిగాయని.. 28 మందిని దారుణంగా చంపేశారన్నారు. 70మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారని, వేలాది మంది బీసీలపై వైసీపీ ప్రభుత్వ దమనకాండ కొనసాగుతోందని, ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ అధికారపార్టీ నేతలకు వంతపాడుతోందని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గంలోని దొమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి వైసీపీ నేతల అధికార మదమే కారణమని ఆరోపించారు. మహేంద్ర కుటుంబం గతంలో తానేటి వనిత గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసింది. స్వయంగా ఆమెకు అనుచరుడిగా ఉండే మహేంద్ర ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. గతంలో రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనమని శ్రావణ్ కుమార్ అన్నారు.
ముఖ్యమంత్రి తమ వెనుక ఉన్నాడన్న ధైర్యంతోనే..
డాక్టర్ సుధాకర్ మరణం నుంచి ఇటీవల కంచికచర్లలో దళితయువకుడిపై మూత్రం పోసిన ఘటన వరకు అన్నింటికీ జగన్ రెడ్డి, వైసీపీ నేతలు, మంత్రుల అహంకారపూరిత అధికార దర్పమే కారణం. ఆ దర్పానికే నెల్లూరులో నారాయణ అనే దళితుడు పోలీసులు చిత్రహింసల వల్ల చనిపోయాడు. కర్నూల్లో దళిత యువకుడిని పోలీసులు దొంగతనం నేరంపై స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంతో అవమానభారంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దళితుల ఆత్మహత్యలు.. హత్యలు ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ చర్యలు..అధికారపార్టీ నేతల దౌర్జన్యం.. వైసీపీ నేతలకు పోలీస్‌శాఖ వత్తాసు పలకడం వల్ల జరుగుతున్నవే. ముఖ్యమంత్రిది తమ కులమని.. తమ పార్టీ… తమ ప్రాంతమన్న అహంకారంమే రాష్ట్రంలో దళితులు..ఇతర వర్గాలను బలితీసుకుంటోంది. కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై మూత్రం పోసిన హర్షవర్థన్ రెడ్డికి పోలీసుల మద్దతు.. అధికారపార్టీ నేతల సపోర్ట్ ఉందన్నది నిజం కాదా? తనవద్ద డ్రైవర్ గా పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి, అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వెనకుంది ముఖ్యమంత్రి అండ కాదా? ఆ ధైర్యంతోనే అనంతబాబు దళితులను చులకనగా మాట్లాడిరది నిజం కాదా? అనంతబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు వైసీపీ నేతలు అతనికి ఊరేగింపు చేయడం.. అతన్ని స్వయంగా జగన్ రెడ్డే తన పక్కన కూర్చోబెట్టుకొని భుజంపై చెయ్యేసి మాట్లాడం దళితులపై వారికున్న చులకనభావానికి నిదర్శనం కాదా అని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
గతంలో మేకతోటి సుచరితకు ఎదురైన పరిస్థితే నేడు తానేటి వనితకు..
దళితజాతిపై సాగుతున్న దమనకాండకు… వైసీపీ నేతల దుర్మార్గాలకు కారణం ముఖ్యమంత్రి అండదండలే. గతంలో హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరితకు ఎదురైన పరిస్థితే నేడు హోంమంత్రిగా ఉన్న తానేటి వనితకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
వైసీపీ నేతల దౌర్జన్యాలకు గురి అవుతున్న దళితుల మానప్రాణాలకు విలువ కట్టి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నా. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినవారికి జగన్‌రెడ్డి కోటిరూపాయల పరిహారం అందించాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలో విద్యుదాఘాతంతో చనిపోయిన దళితుల కుటుంబాల ముఖం కూడా జగన్ రెడ్డి చూడలేదు. అదీ ఈ ముఖ్యమంత్రికి దళితులపై, వారి ప్రాణాలపై ఉన్న ప్రేమ.. అభిమానం. దళితజాతి పేరు చెప్పుకుంటూ సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం లేకుండా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి బతికేస్తున్నాడు. తనకు కుర్చీ ఇవ్వకపోయినా ఆయనకు జగన్ రెడ్డి మంచివాడే. తనను అవమానించినా జగన్ సామాజిక వర్గమంటేనే నారాయణస్వామికి ముద్దు. దళితుల మరణాల పై విచారణ కమిషన్‌ను నియమించలేని మేరుగ నాగార్జున దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. బొంతు మహేంద్ర ని ఎందుకు స్టేషన్ కు పిలిపించారని తన పరిధిలోని పోలీసుల్ని ప్రశ్నించలేని తానేటి వనిత హోంమంత్రా? ఇలాంటి మంత్రులు దళిత సమాజానికి, బీసీ సమాజానికి అవసరమా? ఇలాంటి చేతగాని చేవలేని మంత్రులు మరలా సిగ్గులేకుండా సామాజిక సాధికార బస్సుయాత్ర పేరు తో సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ వ్యాఖ్యలపై దళిత మంత్రులు ఏం సమాధానం చెబుతారు?
మంత్రులు ఎవరూ నోరు తెరవకుండా భయపెడుతూ.. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించుకొని, సకల శాఖలపై పెత్తనాన్ని తన వర్గానికే చెందిన సజ్జలకు అప్పగించి, తన మాటే నెగ్గించుకుంటూ, దళిత..బీసీ..మైనారిటీ వర్గ మంత్రుల్ని జగన్‌రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు అనేది ఎవరూ కాదనలేని సత్యం. కనీస ఆత్మగౌరవం.. కనీస స్వాభిమానం లేని దళిత.. బీసీ..మైనారిటీ మంత్రులు తమవర్గాలను ఏం రక్షిస్తారు? ఈ ప్రభుత్వానికి మొదటి బాధితుడిని నేనే అని స్వయంగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మనే అంటుంటే.. అతన్ని రక్షించేది ఎవరని శ్రావణ్‌కుమార్ ప్రశ్నించారు.
నలుగురు సామంత రెడ్డి రాజుల కింద డమ్మీలుగా దళిత, బీసీ, మైనారిటీ మంత్రులు
రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టి జగన్ రెడ్డి తన వర్గానికి అప్పగించాడు. రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, గోదావరి జిల్లాలను మిథున్‌రెడ్డికి.. ఉత్తరాంధ్ర ను వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టి.. వారికి సజ్జలను బాస్‌గా నియమించి… జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్నది నిజం కాదా? రెడ్లే సామంతరాజులు..రెడ్లే సలహా దారులు.. రాష్ట్రంలో రెడ్లే సర్వం అన్నది నిజం కాదా? ఇతర వర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని డమ్మీలుగా మార్చి, వారిపై పెత్తనాన్ని కూడా సజ్జలకే అప్పగించింది నిజం కాదా? జగన్ రెడ్డికి..సజ్జలకు ఊడిగం చేస్తున్న దళిత.. బీసీ.. మైనారిటీ మంత్రులు ఏ ముఖం పెట్టుకొని సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారో సమాధానం చెప్పాలి
నాలుగేళ్ల 8నెలల పాలనలో జగన్‌రెడ్డి ఒక్క దళితుడికి కూడా పైసా ఆర్థిక సహాయం చేసింది లేదు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి.. దళితులకు జగన్ తీవ్ర అన్యాయం చేశాడు. ఇప్పటికైనా దళిత.. బీసీ.. మైనారిటీ మంత్రులు కనీస ఆత్మగౌరవంతో వ్యవహరిస్తేనే తమతమ వర్గాలకు నిజమైన సాధికారత అనే వాస్తవం గ్రహించాలి. డబ్బులిచ్చి మనుషుల్ని తరలించి.. బస్సు యాత్ర పేరుతో ఉపన్యాసాలిస్తే సామాజిక సాధికారత సాధ్యం కాదు. సామాజిక సాధికార బస్సుయాత్ర జగన్ రెడ్డి కేవలం ఎన్నికలకోసం పెట్టాడనే వాస్తవాన్ని అన్నివర్గాలు గుర్తించాలని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.