- గత ఐదేళ్లు పాలనే లేదు, ప్రచారార్భాటాలు, దోపిడీలకు నిలయం
- వాలంటీర్లకు జగన్ నమ్మక ద్రోహం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో ప్రజాపాలనే లేదు.. ప్రచారం కోసం జగన్ రెడ్డి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత పత్రిక సాక్షికి దోచిపెట్టాడని మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనంతా దోపిడీలకు, ప్రచార ఆర్భాటాలకు నిలయంగా సాగిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డోలా గురువారం మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కటిగా గతంలో చేసిన పాపాలు బయటికి వస్తున్నాయని మంత్రి డోలా అన్నారు.
వాలంటీర్లకు నమ్మకద్రోహం
గతంలో జగన్‌ను నమ్ముకుని గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన చాలా మంది యువత వాలంటీర్ ఉద్యోగాల్లో చేరారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించానని అప్పట్లో జగన్ ఫే˜క్ ప్రచారం చేసుకున్నాడు. వాలంటీర్ల ఉద్యోగాలను జగన్ సీఎంగా కాలంలోను 2023 ఆగస్టు నుంచి రెన్యువల్ చేయలేదు. అంటే సాంకేతికంగా వారు ఉద్యోగాల్లో లేరు. వారిని జగన్ నట్టేట ముంచాడు. వారి వేతనాల గురించి బుధవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ప్రస్తావిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి జగన్ ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరోపణలకు, ఫేక్ పరిపాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. సలహాదారుల పదవీకాలం ముగుస్తోందని వారిని రెన్యువల్ చేసుకున్న జగన్ రెడ్డి.. 2,50,000 వేల మంది వాలంటీర్లకు మాత్రం ద్రోహం చేశాడు. మోసపు మాటలతో రాజీనామా డ్రామాలు ఆడిరచి ఎన్నికల ముందు వరకు వారిని మభ్యపెట్టాడు.
తిరిగి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మంచి చేస్తానంటూ మోసపూరిత మాటలు చెప్పి, తప్పడు ప్రచారం చేశాడు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు కన్నాలేసే సలహాదారులను నియమిస్తే.. మేము ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి సలహాలిచ్చే కన్నయ్యనాయుడు లాంటి నిపుణులను నియమించాం. ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర గేటు కొట్టుకుపోతే వరద ఉన్న సమయంలోనే తిరిగి గేట్లు ఏర్పాటు చేసి నీళ్లు నిలబెట్టుకోగలిగాం. ఇది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. మరి జగన్ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోతే అలాగే వదిలేశాడు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే ఏమీ చేయలేక చేతులెత్తేసిన అసమర్థుడు జగన్.
ఈ పనులన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు కానీ, జగన్ సొంత సాక్షి పత్రికకు మాత్రం డబ్బులు దోచిపెట్టుకున్నాడు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల చేత రూ. 205 కోట్ల ప్రభుత్వ సొమ్ము సాక్షి పత్రిక కొనుగోలుకు ఖర్చు పెట్టించాడు. ఇక సాక్షి పత్రికలో ప్రచార ప్రకటనల కోసం రూ.440 కోట్లు ఇచ్చుకుని, మిగతా అన్ని పత్రికలకు కలిపి రూ.400 కోట్ల ఇచ్చారంటే జగన్ పక్షపాత ధోరణి బయటపడుతోంది. ఏదేమైనా ఆ విధంగా సాక్షి పత్రికకు రూ.651 కోట్లు ప్రజాధనాన్ని దోచిపెట్టింది వాస్తవం కాదా అని మంత్రి డోలా ప్రశ్నించారు.
ప్రమాణం ఎందుకు..విచారణ కోరండి
తిరుమలలో లడ్డూల తయారీలో అధికారులు చెప్పిన వాస్తవాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చాలా కాలం టీటీడీ చైర్మన్‌గా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేద్దాం అంటున్నాడు. లడ్డూల నాణ్యత విషయంలో సీఐడీ, సీబీఐ విచారణ కోరితే బాగుంటుంది కానీ. ప్రమాణం చేద్దామనటమేమిటి? జగన్ హయాంలో టీటీడీలో ఎన్నో దారుణాలు జరిగాయి. వాటిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. ఇప్పటికైనా బురద రాజకీయం మానుకోవాలి. వరదలపై తప్పుడు ప్రచారం మానడంలేదు. వరద బాధితులకు సాయం చేయకుండా పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి కోటి రూపాయలు విరాళం అన్నాడు.
ఎవరికిచ్చాడో, ఏమి చేశాడో తెలియదు. దోపిడీ తప్ప మరేదీ తెలియని వైసీపీ నేతలు అనుచిత విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. వాటినన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లుతున్నాం. జగన్ హయాంలో సలహాదారు దగ్గర నుంచి అటెండర్ వరకు సొంత మనుషులనే నియమించుకున్నారు. ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నాం. దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా స్పష్టం చేశారు.