నెల్లూరు : రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింసకి నెల్లూరు రాజధానిగా మారింది. వాటాలు వేసుకొని మరీ నెల్లూరు జిల్లాని వైసిపి నేతలు పంచేసుకుంటున్నారని అన్నారు. కావలిలో వైసిపినేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ బుధవారం పరామర్శించారు. కరుణాకర్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన బినామీ షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి కలిసి ఒక మల్టీప్లెక్స్ కట్టాలి అని ప్లాన్ చేసుకున్నారు. దానికి కరుణాకర్ ఇళ్ళు కూడా కావాల్సి వచ్చింది. ఇళ్ళు లాక్కోవడానికే కరుణాకర్ ని అంతగా వేధించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.
జగన్ రెడ్డి సీఎం అయిన మొదటి రోజునుండే దళితులపై దాడులు మొదలయ్యాయి. వైసిపి పాలనలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండ్డిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఓట్లేస్తే అన్ని డోర్ డెలివరీ అన్న జగన్ రెడ్డి దళితుల శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించారు. ఎస్సి కార్పోరేషన్ ని నిర్వీర్యం చేశారని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని వివరించారు. దళిత మేధావులను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారని ఆరోపించారు . జగన్ రెడ్డి పరిపాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదు. హక్కుల కోసం పోరాడితే చంపేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందన్నారు.
విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడనే ముద్ర వేసి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లా లో దళిత యువకుడు వరప్రసాద్ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుపడ్డాడని వైసిపి నేతలు, పోలీసులు కలిసి గుండు కొట్టించారు. కాకినాడ లో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ని వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. చీరాల లో దళిత యువకుడు కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేసారు. తిరుపతి లో డాక్టర్ అనితా రాణి వైసిపి అక్రమాలకు సహకరించలేదని వేధించారు. చిత్తూరులో జే బ్రాండ్ లిక్కర్ దందా గురించి ప్రశ్నిం చిన దళిత యువకుడు ఓం ప్రతాప్ ని వైసిపి నేతలు చంపేసారు. జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గం లో దళిత మహిళ నాగమ్మ ని అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకూ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. బకాయిలు చెల్లించమని అడిగినందుకు కానిస్టేబుల్ ప్రకాష్ పై అక్రమ కేసులు పెట్టి సర్వీస్ నుండి తొలగించారు. వైసిపి ప్రభుత్వ చెత్త నిర్ణయాలను ఎండగడుతున్న మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.